- కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జెవివి ఆధ్వర్యంలో సైన్స్ వాక్
ప్రజాశక్తి - విజయనగరం టౌన్/కడప అర్బన్ : శాస్త్ర సాంకేతికతను, శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం సైన్స్ అవార్డులను రద్దు చేసిందని జన విజ్ఞాన వేదిక (జెవివి) నేతలు అన్నారు. సైన్స్ అవార్డుల రద్దు, పాఠ్యాంశాల తొలగింపును నిరసిస్తూ ఆదివారం జెవివి ఆధ్వర్యాన విజయనగరంలో సైన్స్ వాక్, కడపలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయనగరంలో ముందుగా గురజాడ నివాసంలో గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి మూడు లాంతర్లు, ఎంజి రోడ్డు, గంట స్తంభం మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సైన్స్ వాక్ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జెవివి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవిఎన్ వెంకటరావు, రమణ ప్రభాత్, సాహితీ సంస్థ కన్వీనర్ చీకటి దివాకర్ మాట్లాడుతూ.. వైద్య రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయమైన ఆలోచనలు ప్రవేశపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవాళి మనుగడలో విప్లవాత్మకమైన మార్పులను గుర్తించిన డార్విన్ సిద్ధాంతాన్ని రద్దుచేయడం సరికాదన్నారు. దీనివల్ల వల్ల సమాజం మరింత వెనుకబాటుకు గురవుతుందని తెలిపారు. డార్విన్ సిద్ధాంతంతోపాటు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణితం, చరిత్రలోని యునైటెడ్ పాఠ్యాంశాలను రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద ఉన్న హేతుబద్ధత ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సైన్స్ అభివృద్ధి చెందితేనే నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అటువంటి సైన్స్ ప్రోత్సాహాన్ని తగ్గించేలా 72 అవార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేస్తున్నట్టు ప్రకటించడం దారుణమన్నారు. సైన్స్ అవార్డుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడపలోని ప్రెస్ క్లబ్‌లో 'రాజ్యాంగ పీఠిక ముద్రణలో సెక్యులర్, సోషలిస్ట్ పదాల తొలగింపు, సైన్స్ అవార్డుల రద్దు, పాఠ్యాంశాల తొలగింపు' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెవివి రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సైన్స్ అవార్డులను రద్దు చేయడం, సైన్సు చరిత్ర పాఠ్యాంశాలను తొలగించడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు చేస్తుందని విమర్శించారు. అశాస్త్రీయ అంశాలను జొప్పిస్తూ శాస్త్రీయ అంశాలను తొలగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే 'ఆవర్తన పట్టిక', 'డార్విన్ పరిణామ సిద్ధాంతాం'ను తొలగించిందని తెలిపారు. ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలకు, సైన్స్ అధ్యాపక, ఉపాధ్యాయులకు ప్రోత్సాహకంగా అందజేసే సైన్స్ అవార్డులను రద్దు చేయడం సరికాదన్నారు. జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.డి. దేవదత్తం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబశివరెడ్డి, ఎల్‌ఐసి యూనియన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, జెవివి రాష్ట్ర కమిటీ సబ్యులు సరస్వతి, ఎఐటియుసి, డివైఎఫ్‌ఐ, యుటిఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్, జెవివి నేతలు పాల్గొన్నారు.