ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : భారతదేశ ప్రజల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అంశాలు అడుగడుగునా ఉల్లంఘనలకు గురవుతున్నాయని, ప్రపంచంలో భారత రాజ్యాంగానికి ఎంతో గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ దేశ పాలకులు మాత్రం ఆ రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, సామాజిక విశ్లేషకులు, రచయిత డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం గురజాడ పాఠశాలలో రాజ్యాంగ హక్కులు-ఉల్లంఘనలు అనే అంశంపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మంచి భావాలతో రచించినప్పటికీ భవిష్యత్తులో అవసరమనుకుంటే రాజ్యాంగంలోని అంశాలను సవరణలు చేసుకోవచ్చని అంబేద్కర్ ఆనాడే చెప్పారని, అయితే భారతదేశ పాలకులు మాత్రం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల హక్కులను కాల రాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులని రాజ్యాంగం చెబుతుంటే మన పాలకులు మాత్రం మేము పాలకులం ప్రజలు బానిసలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని అంశాల పట్ల ప్రజలకు అవగాహన అవసరమని పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక భారత్ రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగ పీఠిక అంటే ఏమిటి అన్న అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు 3 వేల సదస్సులను నిర్వహించే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ ఎం.వి. ఆర్ కృష్ణాజి, గండ్రేటి లక్ష్మణరావు, డాక్టర్ ఎం.వి.ఆర్ వెంకట్రావు, జిల్లా పూర్వ అధ్యక్షుడు అల్లూరి శివ వర్మ,జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, జన విజ్ఞాన వేదిక పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు, షిణగం శివాజీ, పి. షణ్ముఖరావు, గురజాడ పాఠశాల కరస్పాండెంట్ ఎం.స్వరూప తదితరులు పాల్గొన్నారు.