Nov 15,2023 11:49

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : ' రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి ' అనే వైసీపీ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గంటే కోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అన్నారు. కోటలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి నిర్వహిస్తున్న వైసీపీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను నాశనం చేస్తుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడంతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం, మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. మౌలిక సౌకర్యాల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ స్వలాభం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని చూస్తే రాష్ట్రం పరువు పోతుందన్నారు. రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొనే ప్రభుత్వ అధికారులు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. వైసీపీ శాశ్వతంగా అధికారంలో వుండబోదన్నారు. వైసీపీ ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు పాల్గంటే ఫోటోలు, వీడియోలు తీయాలని టీడీపీ, జనసేన కార్యకర్తలకు సూచించారు. ప్రజాస్వామ్య విలువులను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అమ్మిగారి కోనేరుగట్టు వద్ద 8 ఇళ్లను తొలగించి సుందరీకరణ చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ స్థలంలో వైసీపీ జెండా దిమ్మలు ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అధికారులు ఉల్లంఘిస్తే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. వైసీపీ కార్యక్రమాలకు వెళ్లి చిక్కుల్లో పడవద్దని అధికారులను హెచ్చరించారు. ఆయనతో టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్‌ ఉన్నారు.