19 గంటల్లోనే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ
ప్రజాశక్తి- జామి, విజయనగరం కోట, విశాఖ ఎంవిపి.కాలనీ అమరావతి బ్యూరో, :విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి సమీపాన ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. గాయపడిన వారు సుమారు 39 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో విజయనగరంలో 25 మంది, విశాఖలో 14 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. స్వల్పంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స చేసి ఇళ్లకు పంపించారు. కంటకాపల్లిాఅలమండ మధ్య రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న విశాఖాపలాస పాసింజర్ రైలును, ఆ వెనుక వస్తున్న విశాఖారాయగడ పాసింజర్ రైలు ఢకొీన్న విషయం తెలిసిందే. పట్టాలు తప్పిన వీటి బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్సు రైలు బోగీలపైకి దూసుకెళ్లడంతో పట్టాలు పైకిలేచాయి. ఈ ప్రమాదంలో తొలిరోజే పది మంది మృతదేహాలను బయటకు తీసిన సహాయక బృందాలు, సోమవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో, మృతుల సంఖ్య 13కు చేరింది. ఛిద్రమైన రైలు భోగీలను కట్ చేసి రాయగడ పాసింజర్ రైలు లోకో పైలట్ మృతదేహంతోపాటు మరో ఇద్దరి మృతదేహాలకు బయటకు తీశారు. సంఘటనా స్థలంలో 11 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మరణించారు. మృతుల్లో విజయనగరం జిల్లావాసులే ఎక్కువ మంది ఉన్నారు. పలాస రైలు గార్డు ఎం.శ్రీనివాసరావు విశాఖ రైల్వే ఆస్పత్రిలో మఅతి చెందగా, టెక్కలి సుగుణమ్మ విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతదేహాలను విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. క్షత్రగాతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
- ఇనుప చట్రాల మధ్య చిక్కుకున్న డ్రైవర్, లోకో పైలట్ మృతదేహాలు
రైలు ప్రమాదంలో బోగీలు ఛిద్రమవ్వడంతో ఇనుప ఛట్రాల మధ్య మృతదేహాలు చిక్కుకుపోయాయి. బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాయగడ రైలు అసిస్టెంట్ డ్రైవర్ ఎస్.చిరంజీవి, లోకోపైలట్ సింగంపల్లి మధుసూదనరావు మృతదేహాలు ఇంజన్ల మధ్య చిక్కుకొని నుజ్జునుజ్జు అయ్యాయి. వారి మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలకు ఎక్కువ సమయం పట్టింది. లోకో పైలట్ శరీరం ఛిద్రం కావడంతో మాంసపు ముద్దలు బయటకు తీశారు. వీటిని గుర్తు పట్టేందుకు వీలులేని పరిస్థితి ఉంది.
- ఆటో సిగల్ సిస్టంలో లోపం!
గతంలో రైలు కథలాలంటే స్టేషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాకే రైలుకు గ్రీన్ సిగల్ ఇచ్చేవారు. ఒకవేళ దాని ముందు మరో రైలు వెళితే, అది తరువాత స్టేషన్ చేరుకున్నాక ఈ రైలుకు గ్రీన్ సిగల్ ఇచ్చి వదిలే వారు. కానీ, ఆటో మోడ్ సిగల్ వచ్చాక, ఒకే లైనుపై రెండు రైళ్లను ఐదు నిముషాలు వ్యవధిలోనే గ్రీన్ సిగల్ ఇచ్చి వదులుతున్నారు. పలాస రైలుకు సిగల్ లోపం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కానీ, ఒఆర్ కేబుల్ కట్ అవడం వలన రైలు ఆగిపోయిందని కొందరూ చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితేనే అసలు విషయం తెలియనుంది
- సిగల్ వ్యవస్థ సరిగా లేకే ప్రమాదం
బాధిత ప్రయాణికుల కథనం ప్రకారం... పలాస పాసింజర్ రైలు కంటకాపల్లి స్టేషన్ దాటిన వెంటనే అలమండ స్టేషన్ నుంచి రావాల్సిన గ్రీన్ సిగల్ బదులు పసుపు సిగల్ రావడంతో పలాస రైలు వేగం తగ్గించుకుని నెమ్మదిగా వెళ్తోంది. ఆ వెనుక వస్తున్న రాయగడ రైలుకు కంటకాపల్లిలో గ్రీన్ సిగల్ రావడంతో అది యథావిధిగా వేగంతో అదే లైను గుండా వెళ్లడంతో ముందున్న పలాస రైలును బలంగా ఢకొీంది. కానీ, అధికారులు మాత్రం... ఓవర్ హెడ్ వైర్ తెగిపోవడంతో పలాస పాసింజర్‌కు సిగల్ లేక ఆగిపోయిందని, దీనివల్లే వెనుక వస్తున్న రాయగడ రైలు ఢ కొట్టిందని చెప్తున్నారు. పూర్తి విచారణ జరిపితే తప్ప కారణం చెప్పలేమని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు.
- స్థానికుల చొరవతో తగ్గిన ప్రాణ నష్టం
రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాలైన అలమండ, కుద్దుపాలెం, నారాయణపురం, భీమాలి గ్రామాల ప్రజలు, యువకులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. సంఘటనా స్థలం నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. సుమారు కిలోమీటరు వరకూ భుజాలపై మోసుకొని తీసుకెళ్లి అంబులెన్సుల్లో ఎక్కించారు. వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కొమ్మలు, చెట్లు తొలగించి పోలీసు, రెవెన్యూ, ఇతర సహాయక బలగాలకు సహకరించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రాణపాయం నుంచి బయటపడ్డారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు మహిళలు తాగునీరు, మజ్జిక వంటివి బాధితులకు అందించి సహాయక చర్యలు చేపట్టారు.
- 19 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ
వాల్తేరు డివిజన్ మెయిన్ లైన్‌లోని కంటకాపల్లి - అలమండ మధ్య ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను 19 గంటల్లోనే అధికారులు పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన అరగంటలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అడ్మినిస్ట్రేషన్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్‌ఫోర్స్ బృందాలు, రెస్క్యూ అంబులెన్స్‌లు, యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లును, వైద్య బృందాలను సంఘటనా స్థలానికి తరలించారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా దెబ్బతిన్న కోచ్‌లను తొలగించారు. పునరుద్ధరణ చర్యలను ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ, సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. మెయిన్‌లైన్‌లో రైలు సేవల పునరుద్ధరణ కోసం వెయ్యి మందికి పైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్‌వైజర్లు కృషి చేశారు. అధునాత క్రేన్‌లను, యంత్రాలను ఉపయోగించారు. సోమవారం ఉదయం 11.45కి ట్రాక్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను రైల్వే ఇంజినీరింగ్ అధికారులు ఇవ్వడంతో మధ్యాహ్నం 2:23 గంటలకు డౌన్‌లైన్‌లో గూడ్స్ రైలును, 2:36 గంటలకు అప్‌లైన్‌లో భువనేశ్వర్ - బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నడిపారు. ప్రమాదం కారణంగా 47 రైళ్లు రద్దయ్యాయి. 24 రైళ్లు దారి మళ్లించబడ్డాయి. ఎనిమిది రైళ్లు షార్ట్ టెర్మినేట్ చేయబడ్డాయి. ఎనిమిది రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
జిల్లా కలెక్టర్, ఎస్‌పి ఆదేశాలతో జిల్లాలోని పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఒడిశా నుంచి నాలుగు డిజాస్టర్ బృందాలు చేరుకోగా, 85 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, 123 మంది ఎస్‌సిఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గన్నారు. విశాఖ, విజయనగరం వైద్య బృందాలు బాధితులకు చికిత్స అందించాయి. సహాయక చర్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర అశోక పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది
- డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు
ఘటనా స్థలంలో సహాయక చర్యలను డిప్యూటీ సిఎం బూడి ముత్యాలునాయుడు పరిశీలించారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హుటాహుటిన సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఉన్నారు.
- విజయవాడ రైల్వే డివిజన్‌లో హెల్ప్‌లైన్స్ ఏర్పాటు
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోనూ అధికారులు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అనకాపల్లి; 08924-221698, తుని, 08854-252172, సామర్లకోట 0884-2327010, కాకినాడ టౌన్ 0884-2374227, రాజమండ్రి 0883-2420541, నిడదవోలు 0881-3223325, ఏలూరు 0881-2232267, భీమవరం టౌన్ 0881-6230098, విజయవాడ 0866-2576924, తెనాలి 0864-4227600, ఒంగోలు 08592 -2280308, నెల్లూరు 0861-2342028, గూడూరు 9494178434 నెంబర్లను రైల్వే శాఖ కేటాయించింది. ప్రయాణికులకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది.
- రైలు ప్రమాదంలో మృతుల వివరాలు
1. కంచుబారికి రవి - గొడుకొమ్ము (జామి మండలం, విజయనగరం జిల్లా )
2. కరణం అప్పలనాయుడు - కాపుశంభాం (గరివిడి మండలం, విజయనగరం జిల్లా)
3. చల్లా సతీష్ - తోటపాలెం, విజయనగరం పట్టణం
4. చింతల కృష్ణంనాయుడు - కొత్తవలస (విజయనగరం జిల్లా)
5. రెడ్డి సీతంనాయుడు - రెడ్డిపేట (చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా)
6. మజ్జి రాము - గదబవలస (గరివిడి మండలం, విజయనగరం జిల్లా)
7. పిల్ల నాగరాజు - కాపు శంభాం (గరివిడి మండలం, విజయనగరం జిల్లా)
8. ఎం.శ్రీనివాసరావు - (పార్వతీపురం, పలాస పాసింజర్ రైలు గార్డు)
9. గిడిజాల లక్ష్మి - ఎస్‌పి రామచంద్రాపురం (జి.సిగడాం, శ్రీకాకుళం జిల్లా)
10. టెంకాల సుగుణమ్మ - మెట్టవలస (జి.సిగడాం, శ్రీకాకుళం జిల్లా)
11. సింగంపల్లి మధుసూదనరావు - లోకో పైలెట్, కరాస (విశాఖపట్నం)
12. ఎస్.చిరంజీవి - అసిస్టెంట్ డ్రైవర్ - కుశాలపురం (ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా)
13. గుర్తించని మృతదేహం (కర్నూలు జిల్లా)