Aug 20,2022 06:54

నరేంద్ర అచ్యుత్‌ దభోల్కర్‌ ఒక భారతీయ హేతువాది. మహారాష్ట్రకు చెందిన రచయిత. వైద్యుడిగా 12 సంవత్సరాలు పనిచేసిన తరువాత దభోల్కర్‌ సామాజిక రంగంలో ఉద్యమించారు. వన్‌ విలేజ్‌-వన్‌ వెల్‌ లాంటి సామాజిక న్యాయ ఉద్యమాలలో పాల్గొన్నారు. 1989లో 'మహారాష్ట్ర అంధ శ్రద్ధా నిర్మూలన సమితి'ని స్థాపించి అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు. మాంత్రిక తాంత్రికుల క్షుద్రవిద్యలకు వ్యతిరేకంగా పనిచేశారు. దేశంలో సాధువులనూ వారి లీలలను, మాంత్రిక శక్తులను ఖండించారు. విమర్శిం చారు. వారి శిష్యులనూ భక్తగణాలనూ విమర్శించారు. సతారా లోని ''పరివర్తన్‌'' సంస్థాపక సభ్యుడు. ప్రముఖ భారతీయ హేతువాద సంస్థ సనల్‌ ఎదమరుకు తో సన్నిహితంగా మెలిగారు. మరాఠీ వారపత్రిక ''సాధన''కు దభోల్కర్‌ ఎడిటర్‌ కూడా. భారతీయ హేతువాద సంఘానికి ఉపాధ్యక్షుడిగానూ సేవలందించారు. 1990-2010 మధ్యకాలంలో దళితుల సమానత్వం కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడం కోసం పోరాడారు.
         మూఢనమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ఇవి ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి. ఈ మూఢ నమ్మకం మనిషిని మనిషి లాగా ఉండనివ్వదు. మనిషిని మూర్ఖంగా మారుస్తుంది. ఇలాంటి అంధవిశ్వాసాలు, వాటి నిర్మూలన గురించి దభోల్కర్‌ పలు పుస్తకాలు రాశారు. దాదాపు 3000 పైగా సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2010 అనేక పర్యాయాలు మహారాష్ట్రలో ''అంధవిశ్వాసాల వ్యతిరేక బిల్లు'' కోసం కృషి చేశారు. కాని విజయం పొందలేక పోయారు. ఆయన ఆధ్వర్యంలో ''జాదూ టోనా వ్యతిరేక బిల్లు'' ముసాయిదా తయారైంది. ఈ బిల్లును హిందూ తీవ్రవాద సంస్థలు, హిందూ ఛాందసవాదులూ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వర్కారీ తెగ కూడా వ్యతిరేకించింది. భారతీయ జనతా పార్టీ, శివసేన మొదలగు పార్టీలూ వ్యతిరేకించాయి. ఈ బిల్లు వలన భారతీయ సంస్కృతి, విశ్వాసాలు, ఆచారాలు దెబ్బతింటాయని వాదించాయి. విమర్శకులైతే ఆయనను ''మత వ్యతిరేకి''గా అభివర్ణించారు. ఫ్రాన్స్‌ ప్రెస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దభోల్కర్‌ ఇలా అన్నారు-ఈ బిల్లులో ఒక్క పదమైనా దేవుడు లేదా మతం అనేవాటికి వ్యతిరేకంగా లేదు. ఇందులో మతం గురించి కూడా లేదు. భారత రాజ్యాంగం మతపరమైన హక్కును, స్వాతంత్య్రాన్ని ఇచ్చింది. ఎవరైనా ఏ మతమైనా అవలంబించవచ్చు. కానీ ఈ బిల్లు, అంధవిశ్వాసాలూ ద్రోహపూరిత ఆచారాల గురించి మాత్రమే- అన్నారు. ఈ బిల్లును ఎన్నిసార్లు శాసనసభలో ప్రవేశపెట్టినా చర్చలకు నోచుకోలేదు. దభోల్కర్‌ హత్య జరిగిన తర్వాత రోజు, మహారాష్ట్ర కేబినెట్‌ ఈ బిల్లును ఆర్డినెన్స్‌ ద్వారా పాస్‌ చేసింది. శాసనంగా మారాలంటే పార్లమెంటు ఆమోదించాల్సి వుంటుంది.
             నరేంద్ర దభోల్కర్‌ అనేక హత్యా బెదిరింపులను ఎదుర్కొన్నారు. 1983 నుండి అనేక అవమానాలనూ భరించారు. పోలీసుల భద్రత వద్దన్నారు. 2013 ఆగస్టు 20న దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. ఆయన జీవితాంతం అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన ధీరోదాత్తుడు.
                                 - డా|| యం.సురేష్‌ బాబు