
ప్రజాశక్తి స్పోర్ట్స్ డెస్క్ : 2008లో ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో అందరినీ అలరించింది. కానీ ఈసారి సెమీఫైనల్స్ కాదు కదా.. కనీసం ప్లే-ఆఫ్స్‌కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అన్నిజట్ల ముందు ప్లే-ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలిజట్టుగా ఘోర అవమానాన్ని ఎదుర్కొంది. మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై గత సీజన్‌లో ఫైనల్లో చివరి బంతి వరకు పోరాడి తృటిలో పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు, టాప్‌క్లాస్ ట్రాక్ రికార్డు ఉన్న ధోనీ సారథ్యంలోని చెన్నై ఈసారి తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఓటమికి కారణాలివేనా..!
కరోనా కారణంగా కొంతమంది ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. మిగతా జట్లతో పోలిస్తే చెన్నై జట్టులో ఆడే ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్‌కు దొరకలేదు. హర్భజన్ సింగ్, సురేశ్ రైనావంటి కీలక ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో టోర్నీ ఆరంభానికి ముందే తప్పుకున్నారు. కీలక ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రేవో గాయపడడం జట్టు వైఫల్యానికి ముఖ్య కారణాలు. ఇక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సరిగా ఆడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ తాహిర్‌లాంటి కీలక బౌలర్‌కు అవకాశమివ్వకపోవడం, ధోనీ నిర్ణయాలు కూడా ప్రతికూల ఫలితాలనిచ్చాయి. 17న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ జడేజాకు ఇచ్చి ఐదు బంతుల్లోనే 22 పరుగులు సమర్పించుకొని చేజేతులా ఓటమికి ధోనీపై విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలహీనతలు సీనియర్లు ఎక్కువగా జట్టులో ఉండడం ఇవన్నీ ఓటమికి కారణాలని చెప్పవచ్చు. 2021 సీజన్‌లోనైనా చెన్నై అభిమానుల హృదయాలను గెలవాలని ఆశిద్దాం.