
షార్జా : 115 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 12.2 బంతుల్లోనే ఛేదించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లే అద్భుత బ్యాటింగ్ ఆడి ముంబైకి విజయాన్ని అందించారు. ఇషాన్ కిషన్ (68 : 27 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు క్వింటన్ డికాక్ (46 : 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్)లతో చెలరేగిపోవడంతో ముంబై సునాయస విజయం దక్కించుకుంది.
ఓపెనర్ క్వింటన్ డికాక్ దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదగా, హజల్‌వుడ్ వేసిన రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాదాడు. చాహర్ వేసిన మూడో ఓవర్‌లో డికాక్ మరో ఫోర్ కొట్టగా, హజల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాదాడు. ఐదో ఓవర్‌లో కిషన్ చెలరేగిపోయాడు. రెండు ఫోర్లు, సిక్స్ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్‌లో ఐదు పరుగులు రావడంతో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. తాకూర్ వేసిన ఏడో ఓవర్‌లో డికాక్ ఫోర్, సిక్స్ బాది స్కోర్ వేగాన్ని పెంచాడు. ఎనిమిదో ఓవర్‌లో కిషన్ సిక్స్, తొమ్మిదో ఓవర్‌లో రెండు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. అదే ఓవర్‌లో ఇషాన్ కిషన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్‌లోనూ మరో సిక్స్ బాదగా, 11వ ఓవర్‌లో డికాక్ సిక్స్ కొట్టాడు. 12వ ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన చాహర్.. తాకూర్ వేసిన 13వ ఓవర్‌లో డికాక్ ఫోర్ కొట్టడంతో చెన్నై స్కోర్ 116కు చేరుకుంది. దీంతో చెన్నై విధించిన లక్ష్యాన్ని 10 వికెట్ల తేడాతో 46 బంతులు మిగిలుండగానే విజయం సాధిచింది.
చెన్నై చెత్త రికార్డు నమోదు!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఈ మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇలా బ్యాటింగ్‌కు దిగిందో లేదో క్యూకట్టేసింది. ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్ దెబ్బకు పవర్ ప్లే ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (0), డుప్లెసిస్(1), అంబటి రాయుడు(2), జగదీశన్(0), ఎంఎస్ ధోని(16), జడేజా(7) ఘోరంగా విఫలమయ్యారు. గైక్వాడ్, డుప్లెసిస్‌ను బౌల్ట్ ఔట్ చేయగా, రాయుడు, జగదీశన్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జడేజాను బౌల్ట్ ఔట్ చేయగా, రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ధోని నిష్క్రమించాడు. ఏడు ఓవర్లలోనే సిఎస్‌కె ఆరు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా చెత్త రికార్డును సిఎస్‌కె మూటగట్టుకుంది. రాహుల్ చాహర్ వేసిన ఏడో ఓవర్‌లో భారీ సిక్స్ బాదిన ధోనీ (16) తరువాతి బంతికి కీపర్ చేతికి చిక్కి ఔట్ కాగా, తొమ్మిదో ఓవర్‌లో దీపక్ చాహర్ (0) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. కౌల్టర్ నిల్ వేసిన 15వ ఓవర్‌లో శార్దూల్ తాకూర్ (11) సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కి ఔటయ్యాడు. సామ్ కరన్ ఒంటరి పోరాటం చేస్తూ, అక్కడక్కడ బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. చివరి ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదడంతో కరన్ అర్ధసెంచరీ (52 : 47 బంతులు) నమోదు చేసుకున్నాడు. ఆ తరువాతి బంతికి భారీ షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 8 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లు పడొట్టగా, బూమ్రా, రాహుల్ చాహర్ చెరో రెండు, కౌల్టర్ నిల్ ఒక వికెట్ తీశారు.