Dec 25,2020 14:31

న్యూఢిల్లీ : వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఆప్‌ ఎంపిలు ఇద్దరు శుక్రవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లోపల నిరసన తెలిపారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఆప్‌ ఎంపిలు సంజయ్సింగ్‌, భగవత్‌ మన్‌లు చట్టాలను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ''రైతు వ్యతిరేక నల్లచట్టాలను ఉపసంహరించుకోండి'' అనే పోస్టర్లను ప్రదర్శించారు. ''కరోనా పేరుతో పార్లమెంట్‌ సమావేశాన్ని రద్దు చేశారని, మోడీతో సమావేశమయ్యేందుకు, చర్చించేందుకు ఇతరులకు అవకాశం ఇవ్వడం లేదు'' అని ఆప్‌ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ ‌ అన్నారు. పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టే విధంగా ఉన్న ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ లక్షలాది మంది రైతులు ఢిల్లీ వీధుల్లో ఆందోళన చేస్తున్నారని, వారికి తాము మద్దతునిస్తున్నామని చెప్పారు. ఈ మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రధానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నామని మీడియాతో అన్నారు. ''నెలరోజుల నుండి రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలను మోడీ పట్టించుకోవడం లేదని, ఆయన కళ్లు తెరిపించేందుకే మేము పార్లమెంట్‌లో నినాదాలు చేశాం'' అని భగవత్‌ మను ట్విటర్‌లో తెలిపారు.