
న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి అతిషికి కేజ్రీవాల్ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అతిషికి సర్వీసెస్, విజిలెన్స్ శాఖను కూడా కేటాయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతి కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనాకు పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం 14 శాఖలతో ఢిల్లీ మంత్రులలోనే అత్యధిక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా అతిషి నిలిచారు. పార్లమెంటులో ఢిల్లీ బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజు ఈ చర్య చేపట్టడం గమనార్హం. ఈ రెండు మంత్రిత్వ శాఖలను గతంలో సౌరభ్ భరద్వాజ్ నిర్వహించేవారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ఎల్‌జి వి.కె. సక్సేనా ఆమోదం తెలపడంతో .. ఈ ఏడాది జూన్‌లో అతిషికి రెవెన్యూ, ప్రణాళిక, ఆర్థిక శాఖల అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.