Oct 23,2023 10:41
  • ఇద్దరు టీచర్ల సస్పెన్షన్‌
  • కాలేజీ డైరెక్టర్‌ వింత ప్రవర్తన

న్యూఢిల్లీ : కొత్త విద్యార్థుల పరిచయ కార్యక్రమం సందర్భంగా ఒక విద్యార్థి 'జై శ్రీరామ్‌' అంటూ పెద్దగా నినాదాలు చేస్తుండటంతో వేదికపై నుండి దిగిపోవాల్సిందిగా కోరిన ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులను సస్పెండ్‌ చేసిన ఘటన యుపిలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ నెల 20న చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఫ్యాకల్టీ సభ్యుల చర్య పట్ల హిందూ మతతత్వ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే మరో వీడియో కూడా బయటకు వచ్చింది. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తే ఏ కార్యక్రమానికీ అనుమతించబోమని మరో ఫ్యాకల్టీ సభ్యుడు విద్యార్థులను హెచ్చరించడం ఆ వీడియోలో కనిపించింది. పాలక బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు మతపరమైన నినాదాలను తమ కార్యక్రమాలు, ర్యాలీల్లో చేయడం, కాలేజీ, యూనివర్శిటీ ఆవరణల్లో వివిధ సందర్బాల్లో ఎబివిపి ఏదో ఒక రాజకీయ కారణంతో ఇటువంటి నినాదాలు చేయడం పరిపాటై పోయింది. వెంటనే ఈ వివాదం కాలేజీ కేంపస్‌కు పాకింది. టీచర్లు మమతా గౌతమ్‌, శ్వేత శర్మలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని హిందూ రక్ష దళ్‌ నిర్ణయించింది. దాంతో పోలీసులు వెంటనే కాలేజీ కేంపస్‌ దగ్గర సిబ్బందిని మోహరించారు.
           ఆ తర్వాత కాసేపటికి, ఆ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఎబిఇఎస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ డైరెక్టర్‌ సంజరు కుమార్‌ సోషల్‌ మీడియాలో తెలిపారు. పైగా టీచర్ల ప్రవర్తనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని వేసినట్లు తెలిపారు. ఆ టీచర్ల వ్యవహార శైలి సముచితంగా లేదంటూ సంజరు కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో పోస్టు పెట్టారు. 24గంటల్లోగా కమిటీ తన సిఫార్సులు ఇవ్వాలంటూ ఆదేశించారు. వాటికి కట్టుబడి వుంటామని తెలిపారు. అనంతరం, కమిటీ చేసిన సిఫార్సుకు అనుగుణంగానే ఆ ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యుల సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సస్పెండైన టీచర్లలో ఒకరైన మమతా గౌతమ్‌ అనంతరం ఒక వీడియో ప్రకటన చేస్తూ, జై శ్రీరామ్‌ నినాదాన్ని తాను వ్యతిరేకించలేదని, వేదికపై నుండి దిగిపోయిన ఆ విద్యార్థి తనతో వాదన పెట్టుకున్నాడని, అది తాను వ్యతిరేకించానని చెప్పారు. తన సనాతన మూలాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆన్‌లైన్‌లో అల్లరి మూక తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టామని, తగు చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు.