
పాట్నా : ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నవారిని కనిపించిన వెంటనే కాల్చివేయాలని కేంద్ర మంత్రి అశ్విని చౌబే వ్యాఖ్యానించారు. బిహార్‌లోని పాట్నా జిల్లాలో శుక్రవారం ప్రార్థనా సంఘం వద్ద ఒక వ్యక్తి అతీక్‌కు మద్దతుగా, ప్రధాని మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంఘటనపై చౌబే శనివారం విధంగా స్పందించారు.
జుమ్మా నమాజ్ అనంతరం ఒకరు 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని అరిచినట్లు పాట్నా సిటీ ఎస్‌పి వైభవ్ శర్మ తెలిపారు. ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడని అన్నారు. ఈ నివేదికపై అశ్విని చౌబే స్పందించారు. ''ఈ సంఘటన విచారకరం. బీహార్‌లో ఇటువంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదఅష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలి'' అని అశ్విని చౌబే అన్నారు.
అలాగే నితీష్‌కుమార్ ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. బీహార్‌లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోందని అశ్విని చౌబే విమర్శించారు. బిజెపిని టార్గెట్ చేస్తూ సిఎం నితీశ్ కుమార్ ప్రకటనలు ఇస్తున్నారని.. 2025లో రాష్ట్రంలో యోగి మోడల్‌ను ఎంచుకుని ప్రజలే వారికి సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో బీహార్ ప్రజలు యోగి మోడల్‌ను అధికారంలోకి తీసుకువస్తారని.. బీహార్‌లో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.