Nov 08,2023 13:09

పాట్నా :   జనాభా నియంత్రణ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ బుధవారం ప్రకటించారు. మహిళలకు క్షమాపణలు తెలుపుతున్నానని, తన మాటలతో తప్పుడు సందేశం వెళ్లి వుంటే వాటిని వెనక్కు తీసుకుంటున్నానని అన్నారు. ఎవరినీ నొప్పించేందుకు ఉద్దేశించిచేసిన వ్యాఖ్యలు కావని, జనాభా నియంత్రణకు విదయ అవసరమని తన ఉద్దేశమని అన్నారు. మహిళల అభివృద్ధి, మహిళా సాధికారత పట్ల నిబద్ధత కలిగి ఉన్నానని చెప్పారు.

నితీష్‌కుమార్‌ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేను మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్‌లో సంతానోత్పత్తి రేటు 4.2 నుండి 2.9 శాతానికి పడిపోయిందని పేర్కొంటూ.. మహిళల గురించి వ్యాఖ్యానించారు. '' భర్తల చర్యల వల్ల జననాల రేటు పెరుగుతోంది. అయితే చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే జననాల సంఖ్య తగ్గుతూ వస్తోంది '' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మహిళలను అవమాన పరిచేవిధంగా వ్యాఖ్యానించారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నిరసనలపై నితీస్‌కుమార్‌ మాట్లాడుతూ.. మీరంతా ఎందుకు రచ్చ చేస్తున్నారు. జర్నలిస్టుల ప్రశ్నకు వివరణనిచ్చానని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌డబ్ల్యుసి) కూడా స్పందించింది. నితీష్‌కుమార్‌ క్షమాపణలు చెప్పాలని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌డబ్ల్యుసి) చైర్మన్‌ రేఖా శర్మ డిమాండ్‌ చేశారు.