పాట్నా : బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పలు ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో ఉద్దేశపూర్వకంగానే ముస్లిం, యాదవుల జనాభాను పెంచి చూపారని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఈ చర్య చేపట్టారని అన్నారు. ఆదివారం ముజఫర్‌పూర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. జెడి (యు) ఎన్‌డిఎ భాగస్వామ్యంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో కులగణ చేపట్టాలన్న నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నితీష్‌కుమార్ గతేడాది జెడి(యు) బిజెపితో తెగతెంపులు చేసుకుని, ప్రతిపక్ష కూటమి 'ఇండియా' లో చేరిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోడీని వ్యతిరేకించడమే 'ఇండియా' కూటమి ప్రధాన అజెండా అని అన్నారు. తరువాతి ప్రధాని తానేనని నితీష్‌కుమార్ పగటి కలలు కంటున్నారని, కానీ 'ఇండియా' కూటమి ఆయనను కన్వీనర్‌గా కూడా నియమించలేదని అన్నారు. వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని 40 స్థానాల్లోనూ బిజెపి విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో గూండారాజ్‌కు నితీష్‌కుమారే కారణమని అన్నారు.