Nov 02,2023 16:05

పాట్నా :   కాంగ్రెస్‌ కారణంగానే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి 'ఇండియా ' పురోగతి కనిపించడం లేదని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించిందని, ఇండియా కూటమి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. పాట్నాలో సిపిఐ నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమిలో కాంగ్రెస్‌కు ప్రధాన పాత్రను కేటాయించేందుకు ప్రతిపక్ష సభ్యులందరూ అంగీకరించారని, కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే కాంగ్రెస్‌ మళ్లీ సమావేశానికి సన్నద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.

బిజెపిని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి 'ఇండియా' కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమి ఏర్పాటులో జెడియు నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఇండియా కూటమి చివరి సమావేశం ఆగస్ట్‌ 31-సెప్టెంబర్‌ 1న ముంబయిలో జరిగింది. తరువాతి సమావేశం తేదీలను కాంగ్రెస్‌ నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఢిల్లీలో, మధ్యప్రదేశ్‌లో ఉండవచ్చనే వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు సమావేశం తేదీలను ప్రకటించకపోవడం గమనార్హం.