Oct 25,2023 22:39
  • తెలంగాణ సీట్ల విషయమై చర్చ
  • చంద్రబాబు అరెస్ట్‌ విషయం ప్రస్తావన

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : బిజెపి అధిష్టానంనుంచి పిలుపు రావడంతో పవన్‌కల్యాణ్‌ హైదరాబాద్‌నుంచి హూటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో బుధవారం సాయంత్రం సమావేశమైనారు. అమిత్‌షా నివాసంలో సుమారు 40 నిమిషాలు ఈ సమావేశం జరిగింది ఈ భేటీలో నాదెండ్ల మనోహర్‌, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గురించి ఈ సమావేశంలో చర్చ జరిగింది. కనీసం 20 స్ధానాల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లు, అందులో ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు తమకు కేటాయించాలని పవన్‌కల్యాణ్‌ అమిత్‌షాను కోరినట్లు సమాచారం. ఈ విషయంమీద అమిత్‌షానుంచి స్పష్టమైన హామీ లభించలేదని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపితో పొత్తు ప్రకటించే సమయంలో తమను ముందస్తుగా సంప్రదించలేదన్న విషయాన్ని అమిత్‌షా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సిఐడి అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచడం, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, అధికారపార్టీ బెదిరింపుల గురించి కూడా అమిత్‌షాకు వివరించినట్లు తెలిసింది.