Nov 09,2023 16:46

పాట్నా :   రాష్ట్రంలో రిజర్వేషన్‌లను 50 శాతం నుండి 65 శాతానికి పెంచడానికి అనుమతించే బిల్లుని గురువారం బీహార్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సభ్యులంతా మూజు వాణి ఓటు ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎస్ సి,   ఎస్‌టి, ఇతర వెనుకబడిన తరగతులకు ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. ఇది సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని మించిపోయింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ సంతకం చేయాల్సి వుంటుంది.

సవరించిన కోటా ప్రకారం.. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 20 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ఒబిసి, ఇబిసిలు 18శాతం, 25 శాతం పొందుతారు. గతంలో కోటా (ఒబిసి,ఇబిసిలకు కలిపి) 30 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ఎస్‌టి అభ్యర్థులకు రెండు శాతం రిజర్వేషన్‌ని ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లు ఇబిసిలకు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి 10 శాతం రిజర్వేషన్‌ని మినహాయించింది. ఈ పది శాతం కూడా కలిపితే రిజర్వేషన్లు 75 శాతానికి చేరుతుంది.

వివాదాస్పద రాష్ట్ర వ్యాప్త కులగణన సర్వే నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల తర్వాత రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచతున్నట్లు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రకటించడం గమనార్హం.