న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావిడి మొదలైంది. ఇందులో భాగంగానే ప్రధాన పార్టీలతోపాటు ఆప్ కూడా బరిలోకి దిగి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. రాజస్తాన్‌లో రెండురోజుల క్రితం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. శనివారం 21 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. పార్టీ నేతలైన మనీష్ శర్మ బికనీర్ వెస్ట్ నుండి, ఝబర్ సింగ్ ఖిచర్ సికార్ నియోజకవర్గం నుండి, విశ్వేందర్ సింగ్ రామ్‌గఢ్, ముఖేష్ భూప్రేమి.. సవారు మాధోపూర్ నియోజకవర్గం, రోహిత్ జోషి జోధ్‌పూర్ నుండి ఆప్ బరిలోకి దింపింది. అలాగే పురాన్ మల్ ఖటిక్.. షాపురా నుంచి, రామేశ్వర్ ప్రసాద్ జంద్.. బస్సీ నుండి, అర్చిత్ గుప్తా.. సివిల్ లైన్స్ నుండి పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటించింది.
కాగా, కాంగ్రెస్ ఈరోజు (శనివారం) 19 అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు కాంగ్రెస్ 95 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ ఈరోజు విడుదల చేసిన జాబితాలో ధోల్‌పూర్ నుంచి శోభారాణి కుష్వా, సికార్ నుంచి రాజేంద్ర ప్రతీక్, నగర్ నుంచి వాజీబ్ అలీ, డియోలీ-ఉనియారా నుంచి హరీశ్ చంద్ర మీనా, ఝలోద్ (ఎస్టీ) నుంచి హీరా లాల్ దరంగి, కరౌలీ నుంచి లఖన్ సింగ్ మీనాతోపాటు తదితరులను ప్రకటించింది.
బిజెపి విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే చోటు దక్కించుకున్నారు. ఆమె ఝల్రాపట్న్‌ా నుండి తిరిగి పోటీ చేయనున్నారు. అలాగే రాజసాన్ బిజెపి మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా కూడా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ఆయన అంబర్ నియోజవకర్గం నుంచి పోటీ చేయనున్నారు.