ఉద్యమాలకు ఉదయాలే గాని
అస్తమయాలుండవు
రహదారుల మీద పొడిచిన ఆకాశాలు
రహదారుల మీదే చితికిపోవు
ఏ సెలయేటి కళ్ళలోకో..
ఏ నదీ చర్మాల రంధ్రాల్లోకో
ఏ సముద్ర కెరటాల గూళ్ళలోకో
ఏ చిన్న పిల్లల నవ్వుల్లోకో
కరిగిపోయి కాసేపు విశ్రమించ వచ్చు
ఒక్కోసారి భూమి అడుగున గడియారంలో
కదులుతున్న ముళ్ళ చప్పుళ్ళుగా మారిపోవచ్చు
కాళ్ళ కిందే కాదు, సింహాసనాల కింద కూడా
నేలే వుంటుంది
అదెప్పుడెలా బద్దలవుతుందో తెలీదు
ఎవరి లెక్కలు వారికుంటాయి
ఎవరికైనా రోజులు లెక్కబెట్టుకునే
రోజొకటి వస్తుంది
(రైతుల ఆందోళన 44 రోజులైన సందర్భంగా)
* ప్రసాదమూర్తి , 84998 66699