Feb 11,2021 07:14

(నిన్నటి సంచిక తరువాయి)
భారతదేశంలో కమ్యూనిస్టులు సమాజంలోని కుల సమస్యను పరిష్కరించడంలో విఫలం అయ్యారని కంచె ఐలయ్య నుంచి గెయిల్‌ ఆమ్వేద్‌ వరకు అనేక మంది మేధావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మీ స్పందన ఏమిటి? కుల నిర్మూలన అనే ఒకే ఒక సమస్యపై, తప్పులు దొరకని వాదనలు చేస్తూ కూర్చోవడం కన్నా ప్రజాస్వామ్యవాదులంతా దానిపై ఐక్యంగా పోరాడే సమయం కాదా ఇది?
కులం విషయంలో భారతదేశ కమ్యూనిస్టుల పైన విమర్శలు చేస్తున్నవారు, భారతీయ సమాజంలో కులం మాత్రమే సామాజిక విభజనకు ప్రధానమైన రూపంగా పరిగణిస్తారు. ఈ అవగాహనను కమ్యూనిస్టులు అంగీకరించరు. కులం, వర్గం రెండూ కలిసి సహజీవనం చేస్తాయి, రెండూ మిళితమవుతాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం వలన కులం, వర్గాల సహ సంబంధంలో సంక్లిష్టత ఉంటుంది. వర్గ దోపిడీ, కుల అణచివేతల వ్యతిరేక పోరాటం పరస్పర సంబంధితంగా మేము (మార్క్సిస్టులుగా) చూస్తాం. వర్గ దోపిడీ, కుల అంతస్థుల దొంతరలు భారత ప్రభుత్వానికి ఆధారంగా ఉంటున్నాయి.
1931లోనే కమ్యూనిస్టులు, తమ మొదటి విధాన ప్రకటనలో (ుష్ట్రవ ణతీaట్‌ ూశ్రీa్‌టశీతీఎ శీట Aష్‌ఱశీఅ) కుల వ్యవస్థ, కుల బానిసత్వాల రద్దుకు పిలుపునిచ్చారు. ఆ ప్రకటన తర్వాత వర్గ పోరాటంపై ఆధారపడే విప్లవమే, కులం లాంటి ఉపరితల లక్షణాలను వదిలించేందుకు దారి తీస్తుందనే యాంత్రికమైన అవగాహన కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ధోరణిగా ఉంటున్న విషయాన్ని మనం అంగీకరించాలి. వాస్తవానికి ఇదే, వివిధ కుల, వర్గ అణచివేతల రూపాలను పరిగణ లోకి తీసుకునే విప్లవోద్యమ అభివృద్ధిని అడ్డుకున్నది .
అలాంటి అవగాహన ఎంతో కాలం ఉనికిలో ఉండదు. కమ్యూనిస్టులు భూమి కోసం, బీహార్‌లో, ఇతర ప్రాంతాలలో ఉన్నత కులాల అణచివేతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తమిళనాడులో అనేక రూపాలలో అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో ముందు వరుసలో ఉన్నారు. అన్ని బూర్జువా పార్టీలు కూడా కుల అస్థిత్వాలను బాగా ఉపయోగించుకుంటున్నాయి. అదేవిధంగా, కులంపై ఆధారపడే అస్థిత్వ రాజకీయాలు నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు, ప్రపంచీకరణకు అనుకూలంగా ఉంటున్నాయి. ఇటువంటి వాస్తవ పరిస్థితిలో, వర్గ దోపిడీ, కుల అణచివేతలు రెండింటికీ వ్యతిరేకంగా కలుపుకొని పోయే ఆచరణాత్మక ఉద్యమ నిర్మాణం ఇప్పటికి కూడా కష్టమైన పని. అందువలన ప్రస్తుత కాలంలో కుల నిర్మూలన జరగాలంటే, నయా ఉదారవాద క్రమం, హిందూత్వ శక్తులు పోషిస్తున్న మనువాద క్రమం రెంటినీ కూల్చివేసే పట్టుదలతో కూడిన పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది.
స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో...అత్యంత కష్టాలలో అభివృద్ధి చెందిన కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను వెనక్కి తిరిగి ఆత్మవిమర్శనాపూర్వకంగా చూసుకుంటే...మీరు నేర్చిన గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? అది సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్థ పతనం తరువాతా? లేక నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందిన తరువాతా? లేక బిజెపి, మితవాద శక్తులు ఆధిపత్యం లోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితిలోనా?
సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ప్రధానమైన ముఖ్య భూమికను పోషించినప్పటికీ, కమ్యూనిస్టు ఉద్యమం చిన్నదిగానే మిగిలింది. అది జాతీయ విముక్తి ఉద్యమ నాయకత్వ స్థానాన్ని పొందలేక పోయింది. ఆ నాయకత్వం గాంధీజీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చేతిలో ఉంది. భారతదేశంలో కమ్యూనిస్టులు పోషించిన పాత్రకు చైనా, వియత్నాం దేశాల జాతీయ విముక్తి ఉద్యమాలలో ఆ దేశాల కమ్యూనిస్టులు పోషించిన నాయకత్వ పాత్రకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఇదే.
సోవియట్‌ యూనియన్‌ పతనం, ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులకు కచ్చితంగా ఒక పెద్ద సవాలే...కానీ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు) ప్రపంచంలోని అనేక కమ్యూనిస్టు పార్టీల కంటే ఈ పరిస్థితి నుంచి చాలా క్షేమంగా బయటపడింది. అనేక పార్టీల వలే కాకుండా, సిపిఐ(ఎం)కు సోవియట్‌ యూనియన్‌ పట్ల గుడ్డి విశ్వాసం లేదా శ్లాఘనీయమైన భావన లేదు. సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ యొక్క బాహ్య, అంతర్గత విధానాలను మొదటి నుంచి కూడా విమర్శిస్తూనే, సిపిఐ(ఎం) మార్క్సిస్టు భావజాల మార్గం నుంచి పక్కకు పోలేదు. ఎందుకంటే సిపిఐ(ఎం) ఏర్పడిన నాటి నుంచి, భారతదేశ పరిస్థితులకు మార్క్సిజం, లెనినిజాలను అన్వయించడానికి, వారి స్వంత మార్గాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసుకోడానికి భారతదేశంలో మార్క్సిస్టులు తగిన వారని ప్రకటించింది.
కానీ జాతీయంగా, అంతర్జాతీయంగా అలాంటి తరుణం మొత్తంగా మారింది. 1991 తరువాత కాలంలో భారతదేశంలో నయా ఉదారవాద దశ, హిందూత్వ శక్తుల పెరుగుదల సంభవించింది. ఆ శతాబ్దం మారే సమయానికి, ఈ రెండింటి పరిణామాల ప్రతికూల ప్రభావాలను కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమాలు చవి చూశాయి. స్వాతంత్య్రానంతర భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఇది అత్యంత కష్టతరమైన కాలంగా నేను పరిగణిస్తాను.
భారతీయ సమాజంలో, వర్గాలలో అనేక మార్పులు తీసుకొచ్చిన వినాశనకర పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాడేందుకు మా అవగాహన, వ్యూహాలను పునశ్చరణ చేసుకోడానికి మేం చాలా సమయాన్నే తీసుకున్నామని ఆత్మవిమర్శ చేసుకున్నాం. మేము, భారతదేశం యొక్క బలమైన ప్రజాస్వామిక లౌకిక నైతిక భావాల గురించి ఉదారవాద వామపక్ష కథనాలను, ఈ ఆధునిక లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ కథనంలోని లోపాలను, వక్రీకరణలను చూడకుండానే విశ్వసించాం. ఇది, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ శక్తులు ఆధిపత్య శక్తిగా మారేందుకు అందుబాటులో ఉన్న వనరులను, సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి దారి తీసింది. వీటి నుంచి తీసుకున్న గుణపాఠాలు, కమ్యూనిస్టులు, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఒక బలమైన వేదికను రూపొందించుకోడానికి ఉపయోగ పడాల్సి ఉంది.
ఇటీవల కాలంలో బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు మంచి ఫలితాలు సాధించాయి. ఎన్నికలలో విజయం సాధించేందుకు 'మహా ఘట్‌ బంధన్‌' అనే ఒక ఉమ్మడి కూటమి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో కూడా అటువంటి కూటమిలో మీరు భాగస్వామి అవుతారా? ఒంటరిగా నిలవడానికి లేదా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు హిందూత్వ సవాల్‌గా ఉన్న ప్రస్తుత తరుణంలో అవకాశం లేదా?
సిపిఐ(ఎం), ప్రధాన పాలక పార్టీ, దాని కూటమిని ఓడించడానికి ఒకే భావాలు, ఒకే ప్రయోజనాలు కలిగిన పార్టీలతో అవగాహనతో కూటమిగా ఏర్పడే ఎన్నికల ఎత్తుగడలను ఎప్పుడూ ఉపయోగించింది. బీహార్‌లో మహా ఘట్‌ బంధన్‌, బిజెపి-జనతాదళ్‌ (యునైటెడ్‌) కూటమికి వ్యతిరేకంగా అనేక పార్టీలను భాగస్వాములను చేసింది. ఈ కూటమిలో వామపక్షాలు చాలా ముఖ్యమైన భూమికను పోషించాయి. ఇతర రాష్ట్రాల ఎన్నికలలో కూడా బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ విశాల ప్రాతిపదికన ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే, తమిళనాడు రాష్ట్రంలో ఎఐఎడిఎంకె-బిజెపి కూటమికి వ్యతిరేకంగా డిఎంకె నాయకత్వంలో ఒక బలమైన కూటమి ఏర్పడింది. నిరంకుశ పాలన వలన కలిగే ప్రమాదం ఉన్న నేటి పరిస్థితుల్లో, థర్డ్‌ ఫ్రంట్‌ కంటే కూడా విశాల ప్రాతిపదికన ఐక్యత సాధించడానికే మేం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి వలన ప్రభుత్వాలు ఒక బలమైన ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాలన్న ఆలోచన ప్రజల దృష్టిని ఆకర్షించింది. ప్రపంచం మొత్తంగా ఉన్న మహమ్మారి వ్యాప్తి వలన సోషలిస్టు వ్యవస్థ అవసరం అనే భావనను బలోపేతం చేసిందని మీరు అనుకుంటున్నారా?
వైరస్‌ను నిరోధించేందుకు ప్రజారోగ్య వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను కోవిడ్‌ మహమ్మారి రుజువు చేసింది. ప్రయివేట్‌ ఆరోగ్య వ్యవస్థ ఉన్న అమెరికాకు, బలమైన ప్రజారోగ్య వ్యవస్థలున్న (చైనా, వియత్నాం, క్యూబా) దేశాలకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఉదాహరణకు అమెరికాలో మొత్తం 16 మిలియన్ల కేసులు, ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 20 శాతం మంది అమెరికా లోనే చనిపోవడం, పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజల ఆరోగ్యాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తుందో ఒక భయంకరమైన హెచ్చరికను చేసింది. కోవిడ్‌ అనంతర ప్రపంచంలో ఈ అనుభవాలను మేం ప్రజల వద్దకు పెద్ద ఎత్తున తీసుకు పోవాల్సి ఉంటుంది.