చలిపులి భయపెడుతుంటే..
భోగిమంట బెరుకు పోగొడుతుంది..!
ఇంటికొచ్చిన పంటను చూస్తుంటే..
ఇంతుల మోములు పూబంతుల్లా వికసిస్తుంటారు ..
రంగవల్లులు రమణీయంగా శోభిల్లుతుంటే..
హరిదాసుల కీర్తనలు శ్రవణానందాన్ని అందిస్తారు ..
గగన సీమలో పతంగులు
రెపరెపలాడుతుంటే..
మది గదిలో మల్లెలు పరిమళించినట్లౌతుంది..!
అల్లుళ్ల ఆర్భాటాలు
మరదళ్ల సరససల్లాపాలు
గీములకు నవ వసంతం తెస్తుంటే..
మనుషుల మనసులు మమతల పందిట్లో సేదదీరినట్లౌతోంది..!
మట్టిని పిసికి..
అవని ఆకలి తీర్చే చేతుల రాతలు మారాలిపుడు
బీటలు వారిన బంధాలు సన్నజాజి తీగలా
కుటుంబ వటవక్షానికి అల్లుకోవలసిన సమయమొచ్చింది..
జీన్స్ ప్యాంట్ల జంఝాటం పోయి
పట్టు పరికిణీలలో
మగువుల మందస్మిత కాంతులు
పౌర్ణమివెన్నెలలా శోభిల్లే రోజెపుడొస్తుందో..!?
వలసపోయిన పక్షులన్నీ
తమ తమ గూళ్లకు చేరుతుంటే..
హర్షజలం వర్షజలమై
అక్షుల్ని తడుపుతుంది.
బడుగుజీవుల గుడిసెల్లో
ఆకలి ఆక్రందనలు వినబడనపుడే..
అంతరంగంలో సం''క్రాంతి'' ఆనందతాండవమాడుతూ
కోటిదివ్వెల వెలుగై పరిఢవిల్లుతుంది..!
అటువంటి సంకురాత్రికై
నా మనసు
వెన్నెలకై నిరీక్షించే చకోరపక్షల్లే నిరీక్షిస్తోంది..!!
* కొరాడ అప్పలరాజు