Jan 10,2021 07:11

పైరుచేలు పరవశించి.. ఫలసాయం బండినెక్కి..సంతోష సంరంభాల మధ్య రైతు లోగిళ్లకు చేరే సందర్భం ఇది. అనేకమంది చేతివృత్తిదారులు, శ్రామిక జనులూ అందించే సహాయ సహకారాలతో, సాధన సంపత్తితో సేద్యం ఒక ఉమ్మడి కార్యంగా జరుగుతుంది. ఎండావానలను తట్టుకొని, తెగుళ్ల ఇక్కట్లను దాటుకొని, క్రిమికీటకాది జీవాల నష్టాలను నెట్టుకొని... తుది ఫలం చేతికందే శుభతరుణం ఇది. ఇలా అందరి శ్రమా ఫలించి, పంట కల్లం నుంచి ఇళ్లకు చేరే సందర్భమే ఊరందరి కళ్లకు ఓ అద్భుత పర్వదినం. అప్పుడు మనసు లోగిళ్ల నుంచి ఉప్పిల్లే ఆనంద సందళ్ల పరవళ్లే సంక్రాంతి పండగ.
కాలాలు చాలా చాలా మారి, ఆధునిక సదుపాయాలు చాలా చాలా సమకూరి ... అనేక రంగాలు ఆరంభ రూపురేఖలతో పోల్చలేనంతగా మారిపోయాయి. కొన్ని కొన్ని మార్పులు మినహా ... భూమి, రైతు, శ్రమ అనే త్రిముఖ బంధం ముడిపడి ఉన్న వ్యవసాయరంగం మాత్రం మౌలిక స్వభావంతోనే శోభిల్లుతోంది. సేద్యాన్ని ఒక వ్యాపారంగా, లాభాలు మొలిసే క్షేత్రంగా రైతులు భావించరు. మట్టిలోంచి అన్నాన్ని మొలకెత్తించే కార్యాన్ని తరతరాల అనుబంధంగా, ఒక జీవావసర ప్రక్రియగా తలపోస్తారు. పాడిపంటలు చేతికందే సందర్భాలను పరమానందంగా స్వీకరిస్తారు. అందుకనే సంక్రాంతి నూటికి నూరుపాళ్లూ వ్యవసాయ పండగ. గ్రామీణుల ముంగిళ్ళలో ముగ్గులై, లోగిళ్లలో సంతోష కాంతులై వెల్లివిరిసే పండగ.
పెద్ద పండగ పేర జరిగే సందళ్ల వెల్లువ ఒక రోజుతోనో, ఒక వారంతోనో ఆగిపోదు. భోగి, సంక్రాంతి, కనుమగా మూడ్రోజులు శోభిల్లి; తరువాత తీర్థాలుగానూ, తిరునాళ్లుగానూ జనవరి నెలంతా జోరుగా సాగుతుంది. బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా ఈ సందర్భంగానే ఊరి ఒడికి చేరతారు. మునుపటి ముచ్చట్లతో, ఇప్పటి కబుర్లతో సేదతీరతారు. విడివిడిగా బతికే కుటుంబాలు ఒక మూలకుదురు దరికి చేరుకుంటాయి. బంధాలూ అనుబంధాలతో కనువిందుగా భాసిస్తాయి. కలివిడి జనంతో ఊళ్లు ఉత్సాహంగా ఉప్పొంగుతాయి. అమ్మల, అమ్మమ్మల కళ్లు ఆనందంతో చిప్పిల్లుతాయి. మనిషికి నేలకూ ఉన్న బంధం, మనిషికి మనిషికీ ఉన్న అనుబంధం గురించి పట్నం పిల్లలకు కాస్తయినా తెలుసొస్తుంది. సంక్రాంతిని సేద్యంతో ముడిపెట్టి, రైతు సౌభాగ్యంతో మేళవించి ఎన్నో సినిమాలు వచ్చాయి. బోలెడు కథలూ, కవిత్వాలూ పొంగిపొర్లాయి. వెండితెర మీద సంక్రాంతి ఎప్పుడూ వన్నె తరగని రీతిలోనే వెలుగొందుతుంది.
పండగ సందర్భంగా వ్యాపారాలు ఇబ్బడిముబ్బడిగా సాగుతాయి. అనేక రకాల ఆఫర్లు వెల్లువెత్తుతాయి. వీధివీధినా వివిధ పోటీలు నడుస్తాయి. ఉన్న మేరకు జనం చేతిలోని సొమ్ము కొనుగోళ్లతో మారకం జరుగుతుంది. ఆ మేర చాలామందికి ఉపాధీ, ఆదాయమూ సమకూరతాయి. మొత్తం అన్నింటినీ గుర్తించి గణిస్తే.. ఈ సందర్భంగానూ కార్పొరేట్ల ఖాతాలో జమయ్యే సొమ్మే ఎక్కువ. పర్వదినానికి మూల కారణమైన వ్యవసాయానికి, రైతుకూ దఖలు పడేది తక్కువ. కర్షకుడి సంక్షేమం గురించి మన పాలకులు తగినంతగా పట్టించుకోకపోగా, మరింత నష్టపరిచే చట్టాలను, మార్పులను బలవంతాన రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకనే ఈ పండగ రోజుల్లో కూడా ఎముకలు కొరికే చలిలో లక్షల మంది అన్నదాతలు ఢిల్లీ సరిహద్దున నిరసన స్వరాలు వినిపిస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణకు ససేమిరా అంటున్న బిజెపి.. రాష్ట్రంలో విగ్రహాల పేరిట అనవసర ఉద్రేక ఉద్వేగాలను ఎగదోస్తోంది. దాని విద్వేష రాజకీయ ఎజెండాలో చిక్కుకొని పాలక వైసిపి, ప్రతిపక్ష టిడిపి లు రాష్ట్ర భవిష్యత్తుకు చేటు తెస్తున్నాయి. పనికి రాని సరంజామాను భోగిమంటల్లో ఆహుతి చేయడం ఓ ఆనవాయితీ! ఈసారి అలాంటి చెత్త వస్తు జాబితాలో మూడు వ్యవసాయ నల్ల చట్టాలను జోడించండి అన్న రైతు సంఘాల పిలుపు సమంజసంగానే ఉంది. 'రైతు రారాజై రాణించినప్పుడే దేశం వెన్నెముక నిటారుగా నిలబడుతుంది. రైతు ముఖాన సంతోష కాంతులు చిందినప్పుడు నిజమైన సంక్రాంతి అనబడుతుంది.'