హైదరాబాద్ : సంక్రాంతి పండగ అంటేనే సరదాలు, సంబరాలు. వాటిలో కోడిపందేలు, ఎడ్ల పందేలు ప్రధానమైనవి. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతాయి. కోడిపందేలు అనేవి సంక్రాంతి సంబురాల్లో భాగం. అయితే, ఇది జూదంగా మారిందని ప్రభుత్వం కోడిపందేలపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఈ కోడిపందేలు జరుగుతూనే ఉంటాయి. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ఆడే ఈ క్రీడను వ్యతిరేకించే జంతు ప్రేమికులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. సాధారణంగా రష్మి గౌతమ్ ట్విట్టర్‌లో ఎప్పుడూ మూగజీవాల గురించే చర్చిస్తూ ఉంటారు. మూగజీవాలకు హాని కలిగించొద్దని కోరుతుంటారు. ఎవరైనా మూగజీవాల హింసకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించలేరు. ఇప్పుడు కోడిపందేల విషయంలోనూ రష్మీ స్పందించారు.. తన వాదనను వ్యతిరేకించిన ఒక నెటిజన్‌పై రష్మి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సంక్రాంతి కోడిపందెం గురించి ఓ డాక్టర్ ట్వీట్ చేస్తూ .. తాను రెండు పందేల్లో గెలిచానని, సంక్రాంతిని బాగా ఎంజారు చేశానని చెప్పారు. ఈ స్క్రీన్‌షాట్ షేర్ చేసిన రష్మి ' డాక్టర్ డిగ్రీని మురికి కాలువలో పడేసి.. ఇలా హింసను ప్రోత్సహిస్తున్నారా ' అని ట్వీట్ చేశారు. ఇక ఈ అంశంపై ట్విటర్ వేదికగా చర్చ జరిగింది. అందులో ఓ నెటిజన్ ' కోడికి లేని బాధ మీకెందుకు మేడం. ఇది గర్వం కాదు.. మా సంప్రదాయం ' అని ఘాటుగా కామెంట్ చేశారు. దీనికి సమాధానంగా రష్మి '' కోడికి బాధ లేదని మీకు ఎలా తెలుసు ? అయినా మీరు మనుషుల పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు.. గ్లాడియేటర్ పోరాటాలు సంప్రదాయాల్లో భాగమే. వాటిని స్వీకరించి చనిపోయే వరకు పోరాడడానికి మనుషులను పంపాలి '' అని ట్వీట్ చేశారు.










