ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి సంక్రాంతి పండుగకు రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. తిరుగు ప్రయాణంతో సంబంధం లేకుండా కేవలం ఈ నెల 6 నుండి 14 వరకు ఆర్‌టిసి రూ.141 కోట్ల ఆదాయాన్ని పొందింది. సంక్రాంతికి ముందు రోజుల్లో సాధారణ ఛార్జీలతోనే 3,120 బస్సులను నడపాలని తొలుత ఆర్‌టిసి నిర్ణయించింది. అయితే టిఎస్‌ఆర్‌టిసి, ప్రైవేట్ ఆపరేటర్ల అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్‌టిసి బస్సులకు రద్దీ పెరిగింది. దీంతో ఆర్‌టిసి ముందు నిర్ణయించిన 3,120 బస్సులకు కంటే అధికంగా 3,392 బస్సులను నడిపింది. గతేడాది 2,400 బస్సులే నడిపింది. ఈ ఏడాది దాదాపు వెయ్యి బస్సులు అధికంగా నడిపింది. సంక్రాంతి నేపథ్యంలో గతేడాది రూ.7.17 కోట్ల రోజూవారీ ఆదాయంతో మొత్తం రూ.107 కోట్లు ఆర్జించగా ఈ దఫా రూ.7.9 కోట్ల రోజువారీ ఆదాయంతో రూ.141 కోట్లు ఆర్జించింది. గతేడాది హైదరాబాద్ నుండి 824 బస్సులను నడపగా ఈ ఏడాది 1,483 బస్సులు నడిపింది. తిరుగు ప్రయాణానికి ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్‌టిసి ప్రకటించిన ఆఫర్ కూడా సత్ఫలితాలను ఇచ్చింది. ప్రయాణీకుల నుండి ఎక్కడా ఫిర్యాదులు లేకుండా అంకితభావంతో పనిచేసిన సిబ్బంది అందరికీ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.










