ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆర్‌టిసి పురోగతి కోసం మహిళా ఉద్యోగుల కృషి అభినందనీయమని ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. విజయవాడలోని ఆర్‌టిసి హౌస్‌లో ఆర్‌టిసి మహిళా ఉద్యోగుల ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. డిప్యూటీ సిపిఎం సామ్రాజ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొదట కేక్ కట్‌చేశారు. ఎమ్‌డి తిరుమలరావు మాట్లాడుతూ.. ఆర్‌టిసిలో 5300 మంది మహిళా ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పలువురు మహిళా ఉద్యోగులను ఎమ్‌డి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పి కృష్టమోహన్, సిఎఒ రాఘవరెడ్డి, చీఫ్ ఇంజినీరు సుధాకర్, ఎడి శోభామంజరి తదితరులు పాల్గొన్నారు.










