ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోని పర్యాటక, ప్రముఖ అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం తదితర కీలకమైన అధ్యాత్మిక క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలతో ప్రత్యేక బస్సులు నడుపుతామని, అవసరమైన సందర్భాల్లో ట్రిప్పుల వారీగా ప్రత్యేక సర్వీసులు కూడా నడపుతామని ఆయన తెలిపారు. అవసరమైన చోట్ల గైడ్‌ను, రాత్రి పూట వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. గత ఏడాదిలో శబరిమలకు వెళ్ళే వారికోసం 225 బస్సులు నడిపామని, అదే అనుభవంతో తమిళనాడులోని అరుణాచలానికి 156 బస్సులను విజయవంతంగా నడిపామన్నారు. కార్తీక మాసంలో 'ఒకే రోజులో పంచారామాల దర్శిని' పేరుతో వివిధ జిల్లాల నుండి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. త్రిలింగ దర్శిని, మన్యం దర్శిని, అన్నవరం, అంతర్వేది తిరనాళ్ళు, యాగంటి, ద్వారకాతిరుమల, సింహాచలం, అహోబిలం, శ్రీశైలం తదితర అధ్యాత్మిక ప్రదేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు వున్నాయన్నారు. మహాశివరాత్రికి కోటప్పకొండకు, దసరాకు విజయవాడ కనకదుర్గ గుడికి ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు.
- సోషల్‌మీడియాలో కోరినా చాలు..
బస్సు కావాలని చేయాలని ఎవరైనా సోషల్‌మీడియా ద్వారా అభ్యర్థించినా తాము ఏర్పాటు చేస్తామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కెఎస్ బ్రహ్మానందరెడ్డికి ఎస్ వెంకటరావు అనే ప్రయాణీకుడు కృష్ణా జిల్లా పామర్రు నుండి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు 40 మంది వెల్లేందుకు బస్సు కావాలని ఫేస్‌బుక్‌లో కోరగా వెంటనే గుడివాడ డిపో నుండి బస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. రైళ్లతో పోలిస్తే బస్సులో సమయం ఆదా అయ్యే అవకాశం వున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.










