- ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేశామని ఆర్భాటంగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ఆర్‌టిసిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎపిఎస్‌ఆర్‌టిసికి 11,149 బస్సులు వున్నాయి. ఇందులో 8,743 బస్సులే ఆర్‌టిసివి కాగా, 2,406 బస్సులు అద్దె బస్సులు. గత ప్రభుత్వాల హయాంలో ప్రతియేటా కాలపరిమితి తీరిన బస్సుల స్థానంలో సగటున ఏటా దాదాపు రెండు వేల బస్సులు కొనుగోలు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగన్నరేళ్ల కాలంలో ఆర్‌టిసికి ఒక్క సొంత బస్సును కూడా కొనకుండా హైర్ బస్సులనే తీసుకుంటోంది. ప్రతియేటా అద్దె బస్సులను తీసుకోవడం తప్ప ఎపిఎస్‌ఆర్‌టిసికి సొంతంగా బస్సులు కొనుగోలు చేయకపోవడంతో భవిష్యత్తులో ఆర్‌టిసి మనుగడే ప్రమాదంగా మారుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సంఘాలు కోరితే టెండర్ల దశలో వున్నాయంటూ ఏడాది కాలంగా ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్ప ఎక్కడా బస్సులు కొనుగోలు చేయలేదు. గతంలో ఆర్‌టిసిలో అద్దె బస్సుల రేషియో 15 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏటా కొత్త బస్సులను కొనే పరిస్థితి వుంటే, ఇప్పుడు 30 శాతానికి పైగా అద్దె బస్సులు ఎపిఎస్‌ఆర్‌టిసిని ఆక్రమించినా రాష్ట్ర ప్రభుత్వం కళ్లుతెరవకపోవడం పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌టిసిలో దాదాపు 2,400కు పైగా అద్దె బస్సులు వున్నాయంటే ఆర్‌టిసి పరిస్థితి ఏమిటో అవగతమవుతోంది. 15 ఏళ్లు దాటాక వాహనాలను తుక్కు కింద మార్చాలనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఆర్‌టిసిలో వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తే వందలాది బస్సులు తుక్కు కింద పక్కన పెట్టేస్తే, ప్రయాణికులను చేరవేసేందుకు బస్సులను నడపలేని స్థితికి ఆర్‌టిసి నెట్టివేయబడుతుంది. ఎపిఎస్‌ఆర్‌టిసి 3,354 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని పంపిన నివేదికను ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి వుంది. ఏడాది కాలంగా కొత్త బస్సుల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి అదిగో.. ఇదిగో.. అనడం తప్ప కార్యరూపంలోకి తీసుకురాలేదు. ప్రజల ఆర్థికాభివృద్ధికి కీలకమైన రవాణా వ్యవస్థలో కీలకమైన ప్రజా రవాణాను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం తగదని, తక్షణమే కొత్త బస్సులను ఆర్‌టిసికి సమకూర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.










