విజయవాడ: అడ్డు తప్పుకోవాలని బస్సు హారన్ మోగించినందుకు తనపై 14 మంది విచక్షణారహితంగా దాడి చేశారని నెల్లూరు జిల్లా కావలిలో మూకుమ్మడి దాడిలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ బి.ఆర్.సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. కావలి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం విజయవాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.''రెండు వాహనాల్లో కావలి శివారు ప్రాంతం వరకు బస్సును ఫాలో అయిన 14 మంది ఒక్కసారిగా దాడికి దిగారు. కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. దెబ్బలు తాళలేక రోడ్డుపైనే కింద పడిపోయా. విచక్షణారహితంగా పొట్టపై తన్నారు. ఆ సమయంలో నేను బతుకుతానని అనుకోలేదు. దేవుడి దయవల్లే ప్రాణాలతో బయటపడ్డా. బస్సులోని ప్రయాణికులు, సహడ్రైవర్ వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారిపైనా దాడి చేశారు. దాడి దఅశ్యాలు చిత్రీకరిస్తోన్న ఓ ప్రయాణికుడు, సహ డ్రైవర్ సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొని ధ్వంసం చేశారు.దాడి చేసిన 14 మంది ఫొటోలు నా వద్ద ఉన్నాయి. దాడి ఘటన మొత్తం ఫోన్‌లో రికార్డైంది. అన్ని ఆధారాలు ఉన్నాయి. నాపై దాడి చేసిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తా. నిందితులకు శిక్షపడే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆర్టీసీ డ్రైవర్లపై ఇంత విచక్షణారహితంగా దాడి జరిగిన ఘటన నా 50ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదు'' అని బాధిత డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరుపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘటనకు సంబంధించి.. దేవరకొండ సుధీర్, శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్‌లతో పాటు మొత్తం పది మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. డ్రైవరుపై దాడి చేసిన నిందితులపై ఇప్పటికే నేరారోపణలు ఉన్నాయి. సస్పెక్ట్‌షీట్ తెరిచి ఉంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.










