Aug 16,2023 20:34
  • ఎపిఎస్‌ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-విజయవాడ : ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎపిఎస్‌ ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నాకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, షేక్‌ సాబ్జీ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎపిఎస్‌ ఆర్‌టిసిలో పని చేస్తున్న వేలాది మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సంవత్సరాల తరబడి ఆర్‌టిసిలో పనిచేస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనాలు కూడా అమలు కావట్లేదని, అధికారులు ఇచ్చిన జిఒలు, సర్క్యులర్‌లు కాగితాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను, కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ పూర్తిస్థాయిలో కార్మికులకు అందించే విధంగా చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెంచిన జీతాలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, కాంట్రాక్టు వ్యవస్థ రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వమే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించాలని, గతంలో తొలగించిన కార్మికులను తక్షణమే విదుల్లోకి తీసుకోవాలని, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. అనంతరం ఆర్‌టిసి ఎండికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర నాయకులు సుందరయ్య, జిలానీ బాష, ఫెడరేషన్‌ నగర గౌరవ అధ్యక్షులు యం.బాబురావు, ప్రధాన కార్యదర్శి బి.మాధవ, తదితరులు పాల్గొన్నారు.

2