Dec 23,2022 16:23
  • నాడు-నేడుతో సర్కారు సరస్వతీ నిలయాలకు మహర్దశ 
  • మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు. 

ప్రజాశక్తి - రెడ్డిగూడెం : హైస్కూలులో శుక్రవారం నాడు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు, జెడ్పీ ఛైర్ పర్సన్  ఉప్పాల హారిక విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ కు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇది కార్పోరేట్ కు స్థాయికి మించి ఉత్తమ విద్యను పేద విద్యార్థులు ఉచితంగా పొందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు. చదువుతోపాటు సంస్కారం ముఖ్యమన్నారు. మంచి, చెడు అన్ని చోట్లా ఉంటాయని మంచిని స్వీకరించాలన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. నాడు-నేడుతో సరస్వతీ నిలయాలు నూతన శోభను రంగరించుకున్నాయన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు చదువుతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. ఏ రంగంలో వృద్ధిలోకి రావాలన్నా విద్యతోనే సాధ్యమన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పర్చుకోవాలన్నారు. ఆంగ్లంలో మంచి పట్టు సంపాదించాలన్నారు. అత్యుత్తమ ప్రతిభతో దేశ,విదేశాలలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా థాంక్యూ జగన్ మామయ్య అంటూ విద్యార్థులు నినదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.