Oct 08,2023 13:39

నైఫిడా :   మయన్మార్‌ మాజీ అధ్యక్షురాలు అంగ్‌సాన్‌ సూకీ తనపై నమోదైన ఆరు అవినీతి నేరారోపణలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు నిరాకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ పిటిషన్‌లపై స్పందించేందుకు జుంటా సైన్యం నిరాకరించింది. అక్రమంగా వాకీటాకీలను దిగుమతి చేసుకోవడం, కలిగి ఉండటం, దేశద్రోహం మరియు కొవిడ్‌ ఆంక్షలను ఉల్లంఘించడంపై అంగ్‌సాన్‌ సూకీ చేసిన ఐదు అప్పీళ్లను ఆగస్టులో కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని 2021లో జుంటా సైన్యం పడగొట్టి మయన్మార్‌ను తమ చేతుల్లోకి తీసుకుంది. అప్పటి నుండి సూకీ నిర్బంధంలోనే ఉన్నారు. ఆమెపై దేశద్రోహం, లంచం కేసులతో పాటు టెలికమ్యూనికేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి సుమారు 12కు పైగా నేరారోపణలు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి 27 ఏళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలను అంగ్‌సాన్‌ సూకీ ఖండించారు.

తిరుగుబాటు, ప్రత్యర్థులపై జుంటా సైన్యం అణచివేతలతో మయన్మార్‌ అల్లకల్లోలంగా మారింది. వేలాది మంది జైలు పాలయ్యారు. హత్య చేయబడ్డారు. అంగ్‌సాన్‌ సూకీతో పాటు ఖైదు చేయబడిన ఇతర రాజకీయ నేతలను షరతులు లేకుండా విడుదల చేయాలని అనేక ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఇటీవల జుంటా సైన్యం పాక్షిక క్షమాపణ కింద ఆమెకు ఆరేళ్ల జైలు శిక్షను తగ్గించినట్లు గతంలో మీడియా వెల్లడించింది.