- వి.కోటలో వ్యక్తి దారుణ హత్య
ప్రజాశక్తి-వీకోట : గొడవ చేస్తుండగా మందలించాడని ఇంటి యజమాననిపై అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన సంఘటన వి.కోటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు.. వీకోట పట్టణం భారత్ నగర్ కట్ట కాలువపై ఇంట్లో అద్దెకు ఉన్నవారు గొడవ పడుతుండగా మందలించాడని ఇంటి యజమాని సాంబశివ పిళ్ళై (42) పై నారాయణ నగర్ కు చెందిన మురుగేష్ కుమారుడు బసవరాజ్ కత్తితో విచక్షణారహితంగా పోవడంతో అతను మృతి చెందాడు. సాంబశివయ పిళ్ళై ఇంట్లో కాంచనమ్మ అనే మహిళ అద్దెకు ఉంటుంది. మంగళవారం రాత్రి 10 .30 గంటల సమయంలో ఆమెకు వరసకు సోదరుడైన నారాయణనగర్ కు చెందిన బసవరాజ్ వచ్చి ఆమెతో గొడవ పడుతు ఇంటి తలుపులు గట్టిగా బాదుతుండటంతో గమనించిన ఇంటి యజమాని సాంబశివ ఎందుకు గొడవ పడుతున్నారని మందలించాడు. దీంతో బసవరాజ్ ఆవేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో అకస్మాత్తుగా సాంబశివ పిళ్ళైపై దాడికి పాల్పడి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతనిని కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో అంబులెన్స్ ద్వారా కుప్పం పిఇఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుని కోసం అన్వేషిస్తున్నారు. ఈ మేరకు సీఐ లింగప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాగి గొడవ చేస్తున్న వ్యక్తిని మందలించాడని ఇంటి యజమానినే హత్య చేసిన ఘటన వీకోట లో కలకలం రేపింది..










