Aug 03,2023 15:15

ముంబయి  :  బృహన్‌ ముంబయి ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ( బిఇఎస్‌టి -బెస్ట్‌ ) చేపడుతున్న సమ్మెలో గురువారం ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్ల డ్రైవర్లు కూడా చేరారు. దీంతో ఉదయం నుండి ఘట్‌కోపర్‌, ములుంద్‌, శివాజీ నగర్‌, వర్లితో పాటు మరో ఎనిమిది ఇతర డిపోల సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిందని బెస్ట్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. బెస్ట్‌లోని 12 డిపోలతో పాటు మూడు ప్రైవైట్‌ ఆపరేటర్స్‌కి చెందిన సుమారు 921 బస్సులు రోడ్డెక్కలేదని అన్నారు. జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ డాగా గ్రూప్‌ (ఎస్‌ఎంటి) డ్రైవర్లు బుధవారం నుండి మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుండి మాతేశ్వరి అండ్‌ టాటా మోటార్స్‌తో పాటు మరో రెండు ప్రైవేట్‌ ఆపరేటర్లకు చెందిన డ్రైవర్లు కూడా సమ్మెలో చేరారు.

మూడేళ్లుగా తమ జీతాల్లో సరైన పెరుగుదల లేదని, దీంతో ఖర్చులను భరించడం కష్టతరంగా మారిందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో నెలవారీ ఆదాయంతో పోల్చితే తమ జీతాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.  ముంబయి, థానే, నవీ ముంబయి మరియు మీరా భయంధర్‌ నగరాల్లో సుమారు 3,100 బస్సులు ప్రతిరోజూ 30 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను రవానా చేస్తోంది. వీటిలో ప్రజారవాణా సంస్థ 1,340 బస్సులను కలిగి ఉంది.