Nov 13,2022 15:50

ప్రజాశక్తి - జీలుగుమిల్లి : మండలంలోని ములగలంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో గత కొన్ని రోజులుగా రుణాల విషయంలో రైతులకు సొసైటీ కార్యదర్శిల మద్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. అయితే దీనిపై సంబంధిత సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం పూర్తి స్థాయి విచారణ జరపకపోవడం పట్ల సోసైటీలో ఎమ్ జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకున్న రుణాలు చెల్లింపులు చేయట్లేదని సొసైటీ యాజమాన్యం, తీసుకున్న రుణానికి  చెల్లింపులు చేసిన వాటికి బిల్లు లు ఇవ్వకుండ ఎక్కువ మొత్తంలో రికార్డులలో నమోదు చేసి కార్యదర్శి తప్పుడు ప్రకటనలు ఇస్తు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా ఈ వ్యవహారంపై  పరపతి సంఘం ఉన్నతాధికారులు మాత్రం స్పందించక పోవడం చర్చ నియంశంగా మారింది

  • వివరాలిలా వున్నాయి..

ములగలంపల్లి సొసైటీలో గత నెల 24 న మొండి బకాయిలు చెల్లించట్లేదని సొసైటీ యాజమాన్యం 15 మంది రైతుల స్థిరస్తులను వేలం వేస్తున్నట్లు ఓ ప్రముఖ దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. అయితే దానికి సంబంధించి కొంతమంది రైతులు జిల్లా స్పందన కార్యక్రమంలో పిర్యాదు చేసి రావడంతో వేలం ప్రక్రియ నిలిచింది. వెంటనే కార్యదర్శి తీసుకున్న రుణాలను చెల్లించాలని రైతులపై వత్తిడి తెచ్చారు. అయితే రైతులు మాత్రం అందుకు విరుద్ధంగా తీసుకున్న రుణం కంటే అదనంగా రుణాలు వేసి రుణాలు కట్టాలని వేధిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా పరపతి సంఘం యొక్క ఉన్నతాధికారులు  స్పందించి క్షేత్ర స్థాయిలో పర్యటించి  సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని పలువురు రైతులు కోరుతున్నారు.