
- అందులో రూ. 2,726.43 కోట్లు వినియోగం
- వైసిపి ఎంపి లావు ప్రశ్నకు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,538 కోట్లు విడుదల అయ్యయని, అందులో రూ. 2,726.43 కోట్లు రాష్ట్రం వినియోగించిందని కేంద్ర పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. వైసిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం స్మార్ట్ సిటీస్ మిషన్‌కు ఎంపిక అయ్యాయని, ఈ నాలుగు నగరాల్లో 279 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయని తెలిపారు. వీటిలో 203 ప్రాజెక్టులు (73 శాతం) పూర్తి కాగా, మిగిలిన 76 ప్రాజెక్టులు (27 శాతం) ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. విడుదల అయిన నిధుల్లో విశాఖపట్నం అత్యధిక నిధులు వినియోగించగా, తిరుపతి, కాకినాడ, అమరావతి తరువాత స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయానికి వస్తే, తిరుపతిలో అత్యధికంగా 105 ప్రాజెక్టులు ఉండగా, కాకినాడలో 94, విశాఖపట్నంలో 61, అమరావతిలో 19 ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తి కావటం తిరుపతిలో 60 శాతం, కాకినాడలో 76.60 శాతం, విశాఖపట్నంలో 91.8 శాతం, అమరావతిలో 63.16 శాతంగా ఉందని పేర్కొన్నారు.