Jun 28,2023 14:30
  • సాగు తాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్ దే
  • సాగు తాగునీరుకు నీటి ఎద్దడి ఉండదు

ప్రజాశక్తి - ముద్దనూరు : కృష్ణా జలాలను జిల్లాకు తెచ్చి రైతులకు సాగు ప్రజలకు తాగునీరు అందించిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని ఎంపి అవినాష్ రెడ్డి అన్నారు.  మండలంలోని కాండ్లోపల్లి గ్రామం వద్ద ఉన్న గాలేరు నగరి ప్రధాన కాల్వ నుండి ఆకుతోటపల్లి పెద్దచెరువు,ఉప్పలూరు చిన్న చెరువుకు ఎత్తిపోతల పథకం కింద నీరు విడుదల చేసే కార్యక్రమాన్ని బుధవారం ఎంపీ,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉప్పలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపి మాట్లాడుతూ  రైతులకు సాగు ప్రజలకు తాగునీరు అందించి భూగర్భ జలాలను పెంచేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడులో 11వేల క్యూసెక్కుల నుండి 44వేల క్యూసెక్కుల నీరు పెంచడం జరిగిందన్నారు. గాలేరు నగరి కాల్వ నుండి అవుకు, గండికోట జలాశయాలకు 4వేల క్యూసెక్కుల నుండి22 వేల క్యూసెక్కుల నీరు పెంచినట్లు చెప్పారు. గండికోట ప్రాజెక్టులో ప్రస్తుతం 27 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేసిన నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.వైసిపి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతులకు ప్రాధాన్యత నిచ్చి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఉప్పలూరులోని  చిన్న చెరువుకు పైపు లైన్ గంగాదేవిపల్లి, మంగపట్నం గ్రామాల్లో పథకం ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటలకు ప్రసిద్ధి గాంచిన ఈ గ్రామాలకు నీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 4.8కిలో మీటర్లు కోట్లు6.40 లక్షలు వ్యయంతో పైపు లైను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పధకం ద్వారా 6చెరువులకు నీరు అందుతాయన్నారు.ఎంపీ సహాయ సహకారాలతో పథకాన్ని 600 గంటల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. ఎత్తిపోతల పథకం ద్వారా చుట్టు పక్కల ఉన్న ఆకుతోటపల్లి, చిన్నకత్తెర పల్లి,సోంపల్లి, ఉప్పలూరు,వేల్పుచెర్ల, గంగనపల్లె, పోతనపల్లి గ్రామాల్లోని 2,000 ఎకరాలకు సాగు నీరు అందుతాయన్నారు.రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నట్లు చెప్పారు.
టిడిపి ప్రభుత్వంలో వైసిపి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు నాయుడు మహిళలకు డ్వాక్రా రుణాలు,రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి మొదట కమ్యూనిస్టు పార్టీలో చేరి కాంగ్రెస్, టిడిపి, బిజెపి అని తన స్వలాభం కోసం పార్టీలు మారుతున్నాడన్నారు. దేవగుడి కుటుంబం నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివిధ పదవులను చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేయకుండా తన కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నాడని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి డిపాజిట్ కూడా తెచ్చుకోలేడని ఛాలెంజ్ చేశాడు. లోకేష్ పాదయాత్రలో ప్రజల సమస్యలు వినకుండా వైసిపి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. లేని పధకాలను ప్రకటిస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడును, ఆదినారాయణ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ మల్లిఖార్జున రెడ్డి, మాజీ ఎంపిపి మునిరాజా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ హర్ష వర్ధన్ రెడ్డి, ఎంపిపి ప్రదీప్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపిటిసి వరదారెడ్డి, వైసిపి నాయకులు డాక్టర్ నవజ్యోత్ రెడ్డి, నాయీ బ్రహ్మాణ సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, ఎంపిపి 1 రేణుక, మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, మండల సచివాలయం కన్వీనర్ సుమంత్ యాదవ్, వైస్ ఎంపిపి పుష్పలత,సర్పంచ్ జయరాం నాయుడు, నాయకులు మణికంఠ రెడ్డి,
వీర ప్రతాప్, రవి కుమార్, డిటి సుధీర్ యాదవ్, డిఇ వాసుదేవ రెడ్డి,మండల అధికారులు, సచివాలయం కార్యదర్శి విజయ భారతి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.