ప్రజాశక్తి-మేదరమెట్ల : వచ్చే నెలలో జరగబోయే బాపట్ల జిల్లా అభివృద్ధిపై, కొరిసిపాడు మండలంలోని కొరిశపాడు గ్రామంలో ఉన్న ఎర్రం చిన్న పోలిరెడ్డి ఎత్తిపోతల పథక నిర్మాణంపై మండలి సమావేశంలో చర్చ పెడతానని శాసనమండలి సభ్యులు కేఎల్. లక్ష్మణరావు అన్నారు. సోమవారం రావినూతలలో నిర్వహించిన ఎర్రం చిన్న పోలిరెడ్డి ఎత్తిపోతల పథకంలో వెంటనే పూర్తి చేయాలి అని నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి 2008లో వైయస్. రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి, మైటాస్ కంపెనీకి నిర్మాణ పనులను అప్పజెప్పారు. తర్వాత మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు కొంత పనిని పూర్తి చేశారు. మోటార్స్, గుడ్ల కమ్మ నుండి కొరిశపాడు చెరువు వరకు పైపులైన్ 2011లోనే పూర్తి చేశారు. ఇప్పుడు 67% పనులు పూర్తయినట్లు ప్రభుత్వం చెప్పటం విడ్డురం అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పెదనాన్న పేర్ల ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఎందుకు అలసత్వం జరుగుతుందో ఆలోచించాలన్నారు. సగానికి పైగా పనులు అలా అనే నిలిచిపోయాయి, కాలువలు, పిల్ల కాలువలు పూర్తికాలేదు. ఇంకా పూర్తిగా ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే సుమారు 100 కోట్ల రూపాయలు అవసరమవుతుంది అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతపు రైతులంతా కలిసి ఈ ప్రాజెక్టు వల్ల 20వేల ఎకరాల భూమి సాగులోనికి వస్తుంది అనే కలను నెరవేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ 2013 యాక్ట్ ప్రకారం ఏ రైతు అయితే ప్రజల ప్రయోజనాల దృశ్య భూమిని ఇచ్చాడో ఆ రైతుకు ఆ భూమి విలువ మీద నాలుగువంతులు విలువలను కలిపి ఇవ్వాలి అని యాక్ట్ చెబుతుంది అన్నారు. భూమి ఇచ్చిన రైతు సంతోషంగా ఉండాలని అన్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ నిర్మాణం కోసం కావలసినంత బడ్జెట్ను ప్రభుత్వం చే మంజూరు చేయించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది, అందుకు ఈ ప్రాంత రైతులంతా కలిసి ఐక్యతతో ముందుకు రావాలని ఆయన సూచించారు. సదస్సు అనంతరం ప్రాజెక్టు నిర్మాణ సాధన కోసం 12 మంది సభ్యులతో కూడిన ఎత్తిపోతల పోరాట సాధన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి తలపనేని రామారావు, కవులు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాయిని వినోద్ బాబు, ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పెంట్యాల హనుమంతరావు, నాగులుప్పలపాడు మండల బాధ్యులు శ్రీకాంత్, కందిమల్ల రామ కోటేశ్వరరావు, మండల రైతు సంఘం బాధ్యులు కోల్లా సుబ్బారావు, నాతాని హనుమంతరావు సుమారు 70 మంది రైతులతో కలిపి ఈ సదస్సును నిర్వహించడం జరిగింది.










