Jan 06,2023 15:22

ప్రజాశక్తి-కంచికచర్ల : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కంచికచర్ల జుజ్జూరు రోడ్డు, 7వ వార్డులో శుక్రవారం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు అమలు తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. పాత సినిమా హాలు సెంటర్లో రోడ్డు పక్కన షెడ్లు వేసి కూరగాయలు అమ్ముకుంటున్న మహిళలను కలుసుకొని, పధకాల అమలు తీరును తెలుసుకున్నారు. రోడ్డు పక్కనే వ్యాపారం ఎలా ఉందని, రోజుకు ఎంత సంపాదిస్తారని అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులగా నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుండి వడ్డీ లేని ఋణాలు అందజేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రహదారి గోతులు మయంగా ఉండటం వల్ల, వాహనాల నుండి వచ్చే దుమ్ము, ధూళి వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు, త్వరితగతిన రోడ్డు నిర్మించాలని పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి స్పందించిన ఆయన కంచికచర్ల గ్రామం చివర నుండి, పెద్దాపురం వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే కంచికచర్ల గ్రామం లో కూడా నిర్మాణ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో ఎంపిపి షేక్ బషీర్, జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, సర్పంచ్ వేల్పుల సునీత, ఉప సర్పంచ్ వేమా సురేష్ బాబు, వైసిపి నాయకులు కాలవ వాసుదేవరావు, పెదబాబు, నంబూరి పెదబాబు, వేల్పుల శ్రీనివాస్, రమేష్, మార్త శ్రీనివాసరావు, నారిశెట్టి శ్రీనివాస్, గురవయ్య, వంగా శ్రీనివాసరావు, ఎంపీడీవో కె బాలశంకరరావు, హౌసింగ్ ఏఈ నరసింహారావు, కార్యదర్శి కనగాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.