ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2022 జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు ఏపిలో 1,728 మంది బాల కార్మికులు అదృశ్యమయ్యారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 58,546 మంది బాల కార్మికులు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 13,591 మంది బాల కార్మికులు కనిపించకుండాపోయారని, కాగా, రెండో స్థానంలో మధ్యప్రదేశ్‌లో 12,679 మంది బాల కార్మికులు అదృశ్యమయ్యారని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలో 5,494 మంది, ఒరిస్సాలో 4,004 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 3,691 మంది, గుజరాత్‌లో 3,675 మంది, రాజస్థాన్‌లో 3,338 మంది, ఢిల్లీలో 3,117 మంది, ఉత్తరప్రదేశ్‌లో 2,788 మంది, తెలంగాణలో 74 మంది బాల కార్మికులు అదృశ్యమ్నైట్లు ఆమె తెలిపారు.
- ఏపికి 17,907 మంది చిన్నారుల వలస
కాగా ఆంధ్రప్రదేశ్‌కు 17,907 మంది చిన్నారులు వలస వచ్చారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపికి 2020-21లో 29,975 మంది, 2021-22లో 7,500 మంది, 2022-23లో 17,907 మంది చిన్నారులు వలస వచ్చారని మంత్రి తెలిపారు. తెలంగాణకు 2020-21లో 6,895 మంది, 2021-22లో 4,870 మంది, 2022-23లో 6,454 మంది చిన్నారులు వలస వచ్చారని తెలిపారు.