Jul 09,2023 06:35

ఒక చెరువు వద్ద ఇద్దరు జాలరులు చేపలు పట్టుకుంటున్నారు. వలలో పడిన చేపలను పక్కనే వున్న బుట్టలో వేసుకొని తిరిగి వలను చెరువులోకి విసురుతున్నారు. ఆ చెరువు పక్కనే వున్న చెట్టుపై కూర్చోని వున్న ఒక కోతి ఇదంతా గమనిస్తోంది. జాలర్ల లాగే తనకూ చేపలు పట్టడం నేర్చుకోవాలనిపించింది. మధ్యాహ్నం అవుతూనే జాలర్లు వలను చెరువులోకి విసిరి చెట్టు కింద నీడలో కూర్చోని భోజనానికి ఉపక్రమించారు. భోజనం అయ్యాక ఎండ తీవ్రత ఎక్కువగా వుండడం వల్ల చెట్టు నీడన కునుకు తీయసాగారు.
ఆ సమయంలో కోతి నెమ్మదిగా చెట్టు దిగి చెరువు గట్టుకు వచ్చి ఆ వలను అటూ ఇటూ ఊపసాగింది. వల బరువుగా అనిపించడంతో తన బలాన్నంతటినీ ఉపయోగించి ఊపసాగింది. ఈ క్రమంలో పట్టు తప్పి, కాలు జారి వలపై పడిపోయింది. కోతి బరువుకు వల కిందకు కుంగగా కోతి చెరువులో మునిగిపోసాగింది. హఠాత్తుగా ముంచుకొచ్చిన ఆ ఉపద్రవానికి కోతి భయపడిపోయింది. గట్టిగా అరుస్తూ ఉంది. కోతి అరుపులకు జాలర్లకు మెలకువ వచ్చింది. నీటిలో మునిగిపోతున్న కోతిని రక్షించేందుకు గబ గబ చెరువు గట్టుకు వెళ్ళి వలను బలంగా లాగారు. కోతి ఒడ్డున పడింది. తనను ఆపద నుండి రక్షించినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు కిచకిచమని అరిచి వేగంగా గెంతుతూ దూరంగా పారిపోయింది. ఈ సంఘటనతో తనకు తెలియని పనులలో అనవసరంగా వేలెట్టకూదదని, ఏదైనా పని చేయాలనుకుంటే ముందు దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆ కోతి అనుభవపూర్వకంగా తెలుసుకుంది.

- సిహెచ్‌. ప్రతాప్‌ హైదరాబాద్‌.