May 17,2023 13:12
  • ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు మెరిట్ అవార్డులపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం  

ప్రజాశక్తి-అమరావతి : విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ, పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పోటీ ప్రపంచంలో నిలబడేలా చూడాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు మెరిట్ అవార్డులపై ఆయన మీడియాతో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాలు వచ్చే దిశలో అధునాతన వసతులు, మెరుగైన విద్యా బోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని తెలిపారు. ఇంతవరకు అమలు చేసిన వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలకు తోడుగా ఈ సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో (10 వతరగతి, ఇంటర్మీడియట్) అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. నగదు ప్రోత్సాహకం, మెరిట్ సర్టిఫికేట్ తోపాటు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు కూడా ప్రోత్సహించడం ద్వారా, ఇతర విద్యార్థుల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలన్న తపన,. ఆసక్తి, పట్టుదల పెరిగేలా చూడాలన్నది ప్రభుత్వ ఆశయమని అన్నారు.  ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలు సాధించిన మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.. ఇంటర్మీడియట్ స్థాయిలో గ్రూపుల్లో అగ్రస్థానాల్లో నిలిచిన వారికి ఈ మెరిట్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించి, ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. పదో తరగతి స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి, ఇంటర్మీడియట్ స్థాయిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న ఒక్క విదాయర్థికి (ఒక్కో గ్రూపులో ఒక్కోక్కరికి చొప్పున) ఈ అవార్డులను అందచేయనున్నామన్నారు. విద్యాశాఖా పరంగా అంతర్గతంగా చర్చించుకున్న అనంతరం, ముఖ్యమంత్రి  ఆమోదంతో వీటిని అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మూడు అంచెల్లో అందించేలా కార్యాచరణను రూపొందించామన్నారు. 

  • అవార్డులను ప్రదానం చేసే తేదీలు

అవార్డులను అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మే 23వ తేదీన (నియోజకవర్గ మండల కేంద్రంలో), జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో మే 27వ తేదీన, రాష్ట్ర స్థాయిలో మే 31వ తేదీన నిర్వహించే కార్యక్రమాల్లో అందచేయనున్నామని ఆయన తెలిపారు. ఈ మూడు అంచెల కార్యక్రమంలో మొత్తంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో కలిపి 3075 మంది విద్యార్ధులను సత్కరించనున్నామన్నారు. 1)జెడ్ పి/గవర్నమెంట్ / మున్సిపల్, 2) ఎపి మోడల్ 3) బిసి రెసిడెన్షియల్ 4) ఎపి రెసిడెన్షియల్ 5)సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 6) ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 7) జిటిడబ్ల్యు ఆశ్రమ్ స్కూళ్లు 8) కెజిబివి ఇలా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలోని అన్ని విద్యా సంస్థల్లోని విద్యార్థుల ఫలితాలను పరిగణనలోనికి తీసుకున్నామని పేర్కొన్నారు.