Sep 27,2023 21:34

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల, ఉన్నత విద్యలో నాణ్యతను పెంచేందుకు ఎన్నో సంస్కరణలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎం జగన్‌మోహన్‌రావు, ఎన్‌ ధనలక్ష్మి, జి శ్రీనివాసనాయుడు, కె అనిల్‌కుమార్‌, కిలారి వెంకట రోశయ్య విద్యారంగంపై అడిగిన ప్రశ్నలకు బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ను ఏర్పాటు చేశామని, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లను పెట్టామని తెలిపారు. గతంలో విద్య అంటే కేరళ రాష్ట్రం గురించి చెప్పేవారని, ఇప్పుడు దేశం దృష్టి ఆంధ్రప్రదేశ్‌పై పడిందన్నారు. ఉపాధి కల్పించే కోర్సులతో డిగ్రీ చదువులను తయారు చేశామన్నారు.

అందరూ మెచ్చేలా అంబేద్కర్‌ విగ్రహం : మంత్రి మేరుగ

చంద్రబాబు అమరావతిలోని ప్రాధాన్యత లేని ప్రాంతంలో 125 అడుగులు అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించి అమలు చేయకపోతే జగన్‌ ప్రభుత్వం విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎమ్మెల్యేలు వి వరప్రసాదరావు, టిజెఆర్‌ సుధాకర్‌, జొన్నలగడ్డ పద్మావతి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు.

కౌలురైతులకు రైతుభరోసా ఇస్తున్నాం : మంత్రి కాకాని

రాష్ట్రంలో కౌలురైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్‌ పథకాన్ని ఇవ్వకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.13,500లను ఇస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, అబ్బయ్యచౌదరి, పి శ్రీనివాసరావు, ఎ శివకుమార్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. సిసిఆర్‌ కార్డులతో కౌలురైతులకు పంటపై హక్కులు వుంటాయన్నారు. రాష్ట్రంలో 25,66,147 కార్డులను కౌలురైతులకు అందించామని తెలిపారు. 5,38,227 మంది కౌలురైతులకు రైతుభరోసాను అందిస్తున్నామన్నారు. 2,41,453 మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీ, 3,54,878 మందికి ఉచిత పంటల బీమా, 36,760 మందికి సున్నా వడ్డీని అమలు చేసినట్లు పేర్కొన్నారు.

రూ.23,167 కోట్లు ఖర్చు చేశాం : మంత్రి అంజాద్‌ బాషా

మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.23,167 కోట్లు ఖర్చు చేసినట్లు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌బి అంజాద్‌ బాషా తెలిపారు. ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, ముస్తాఫాషేక్‌, వవాజ్‌ బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి చెప్పారు. మైనార్టీల కోసం ఇమామ్‌లకు, మౌజమ్‌లకు, ఫాస్టర్‌లకు గౌరవ వేతనాలు ఇస్తున్నామని తెలిపారు.