
ప్రజాశక్తి - సీతమ్మధార (విశాఖపట్నం) : ప్రతి నెలా కనీసం ఒక పరిశ్రమైనా వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. విశాఖ సీతమ్మధారలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని సహజ వనరుల గురించి బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సిఎం జగన్మోహన్‌రెడ్డి బ్రాండ్ కనిపించిందని, దేశమంతా ఈ సమ్మిట్ గురించే చర్చించుకుంటోందని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ వల్ల రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 352 ఎంఒయులు, తద్వారా ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. దేశంలోని మూడు కీలక కారిడార్లు ఎపి మీదుగా సాగడం మంచి పరిణామమన్నారు. దేశంలోనే అధిక వనరులు ఉన్న జిల్లా విశాఖ అని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 40 వేల ఎకరాలు స్థలాన్ని పరిశ్రమల కోసం సిద్ధంగా ఉంచామన్నారు. పారిశ్రామికవేత్తలు కోరుకునే వివాద రహిత స్థలం, నిరంతర విద్యుత్, నీటి సరఫరా ఎపిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అంశాలకే ప్రధాన్యత ఉంటే ఎపిలో మాత్రం 14 రంగాల్లో పెట్టుబడులకు అనువైన పరిస్థితి వుందని చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పుష్కలంగా వచ్చాయన్నారు. వెబ్‌సైట్ ద్వారా ఎవరైనా పెట్టుబడులకు ముందుకు రావొచ్చని తెలిపారు. పెట్టుబడుల సదస్సు చూసిన తర్వాతైనా ప్రతిపక్ష పార్టీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా విండ్ లేదంటే సోలార్ పవర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. త్వరలోనే మచిలీపట్నం, భావనపాడు పోర్టుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. ఐటి రంగంలో రూ.35 వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె రాజు పాల్గొన్నారు.