
- హిరోషిమాలో భారీ ర్యాలీ
హిరోషిమా : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జరిపిన అణు దాడికి నేలమట్టమైన హిరోషిమా నగరమే శుక్రవారం నాటి జి-7 దేశాల సదస్సుకు వేదికైంది. సామ్రాజ్యవాద దేశాల కూటమి జి-7కు వ్యతిరేకంగా హిరోషిమాలో ప్రపంచ వ్యవస్థను తన వేలితో శాసించాలని చూసే జి-7ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆందోళనకారులు సదస్సు వేదికకు చాలా దగ్గరలోనే వున్న శాంతి పార్క్ వద్ద గుమిగూడారు. ''జంక్ జి 7'', ''యుద్ధాన్ని పురిగొల్పవద్దు'', ''జపాన్-అమెరికా సైనిక పొత్తు వద్దు '' అంటూ నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఆందోళనకారులు ప్రదర్శన నిర్వహించారు. ''అమెరికా సామ్రాజ్యవాదులు, నెంబర్ వన్ టెర్రరిస్ట్'', అసత్యాలు ఆపండి, యుద్ధాన్ని ఆపండి, క్వాడ్ కూటమి వద్దు, నాటో కూటమి వద్దు అని నినాదాలు చేశారు. అమెరికా యుద్ధ వ్యతిరేక పౌర సంస్థ సభ్యుడు కొడీ అర్బన్ కూడా ఈ ప్రదర్శకుల్లో వున్నారు. అమెరికా నేతృత్వంలో సాగే జి-7 సదస్సును ''ఉద్రిక్తతలు సృష్టించేందుకు సంపన్న దేశాల కుట్ర''గా ఆయన అభివర్ణించారు. అమెరికన్లుగా మేం అమెరికా ప్రభుత్వాన్ని సమర్ధించడం లేదు అని చెప్పడానికే తానిక్కడకు వచ్చానని 32ఏళ్ళ కొడీ అర్బన్ చెప్పారు. నిరసన తెలియచేసేందుకే ఆయన ఒరెగావ్ రాష్ట్రం నుండి ఇక్కడకు వచ్చారు. జి-7 ఎజెండాకు తామంతా వ్యతిరేకమన్నారు. సంపన్న ప్రభుత్వాల ఎజెండా అదని అంతేకానీ శాంతి సుస్థిరతల ఎజెండా కాదని స్పష్టం చేశారు. హిరోషిమాతో సహా జపాన్‌లో పలు నగరాల్లో శుక్రవారం నిరసనలు, ర్యాలీలు జరిగాయి. దేశ విదేశాల నుండి వచ్చిన వారు వీధుల్లోకి వచ్చి జి-7కి వ్యతిరేకంగా నినదించారు.
అమెరికా అణు దాడిలో ధ్వంసమైన నగరం పేరుతో ప్రధాని కిషిదా తన స్వంత రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తున్నారని పలువురు జపనీయులు విమర్శిస్తున్నారు.
ఉక్రెయిన్‌కు వత్తాసు, రష్యాపై ఆంక్షలు
ఉక్రెయిన్‌కు ఆయుధాలు, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని జి 7 దేశాలు నిర్ణయించాయి. యుద్ధ సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక పరికరాలు, సేవలపై మరిన్ని కఠినమైన ఆంక్షలను విధిస్తున్నట్లు వెల్లడించాయి.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమై 15మాసాలైన నేపథ్యంలో రష్యాను ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ఆంక్షలు విధించాయి..రష్యాపై ఆధారపడడం తగ్గించాలని, అలాగే జి-7 ఆర్థిక వ్యవస్థలను రష్యా ఉపయోగించుకునే అవకాశాలను మరింత నియంత్రించనున్నట్లు భావిస్తున్నట్లు జి-7 తెలిపింది.. ప్రస్తుతమున్న ఆంక్షల వ్యవస్థనుండి తప్పించుకోకుండా నివారించడానికి కూడా తాము చర్యలు తీసుకుంటామని తెలిపాయి. అంతకుముందు అమెరికా సహా జి 7 దేశాలు తాము స్వంతంగా తీసుకునే చర్యలను ప్రకటించాయి. రష్యా, ఇతర దేశాలకు చెందిన మరో 70 సంస్థలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నట్లు అమెరికా సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. అలాగే రష్యాతో జరిగే వజ్రాల వ్యాపారాన్ని బ్రిటన్ లక్ష్యంగా చేసుకుంది. రాగి, అల్యూమినియం, నికెల్‌తో పాటూ రత్నాల దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది. రష్యాలో దొరికే, ఉత్పత్తయ్యే లేదా ప్రాసెసయ్యే వజ్రాలను వినియోగించడం, వాటి వ్యాపారం ఆంక్షలు విధిస్తున్నట్లు జి 7 ప్రకటన పేర్కొంది.
భారత్ సహా పలు దేశాల నేతలు, కొన్ని అంతర్జాతీయ సంఘాలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, వాతావరణమార్పులతో సహా ప్రధాన అంశాలన్నీ ఈ సమావేశాల్లో చోటు చేసుకునే అవకాశం వుంది. అయితే స్పష్టమైన ప్రకటన లేదా ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి.
జెలెన్‌స్కీ, మోడీ భేటీకి యత్నాలు
హిరోషిమాలో జరుగుతున్న జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో విడిగా భేటీ అయ్యే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు భారత దౌత్యవర్గాలు తెలిపాయి. మోడీ తన మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం జి-7 సదస్సుకు అతిధి హౌదాలో హాజరయ్యారు. తరువాత పవువా-న్యూగినియా, ఆస్ట్రేలియాలో ఆయన పర్యటిస్తారు.