Sep 26,2023 22:02
  •  రూ.114 కోట్లు తిన్నారు
  •  శాసనసభలో మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్‌నెట్‌ స్కామ్‌లోనూ రూ.114 కోట్లు తిన్నారని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ ఆరోపించారు. మంగళవారం శాసనసభలో స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యేలు అబ్బయ్యచౌదరి, మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఫైబర్‌నెట్‌ అంశంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన విధానంపై మాట్లాడారు. ఫైబర్‌నెట్‌ను టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టేందుకు అనేక తప్పుడు మార్గాలను అనుసరించిందని అన్నారు. చౌకదుకాణాల్లో ఇ-పోస్‌ మిషన్‌ల పంపిణీలో సరిగ్గా వ్యవహరించలేదని బ్లాక్‌లిస్టులో వుంచిన టెరాసాఫ్ట్‌ కంపెనీని ఈ టెండర్‌లో పాల్గొనేందుకు ఎలాంటి విచారణ లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించిందని అన్నారు. ఈ అంశంపై గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ రిపోర్టును పక్కనబెట్టి చంద్రబాబు టెరాసాఫ్ట్‌ కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారని విమర్శించారు. చంద్రబాబుకు సన్నిహితులైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌, దేవినేని సీతారామయ్యను డైరెక్టర్లుగా నియమించి రూ.114 కోట్లను పక్కదారి పట్టించారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా 2016లోనే ఫైబర్‌నెట్‌లో భారీ కుంభకోణం ఉందని శాసనసభలో చెప్పారని ఈ సందర్భంగా అప్పటి జగన్‌ ప్రసంగాన్ని వీడియోలో ప్రదర్శించారు. టెండర్‌ ప్రక్రియ నుంచే ఫైబర్‌నెట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. టెరాసాఫ్ట్‌ కంపెనీ షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని చంద్రబాబుకు చేరవేసిందన్నారు.