Jul 20,2023 09:14

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ, విశాఖ : వర్షాల వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాకు వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విశాఖలోని జివిఎంసి కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది జులై 9న శబరి నది ఉప్పొంగి చింతూరు ప్రాంతమంతా జలమయమైందని, అనేక గ్రామాలు నీట మునిగాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి అక్కడ ప్రజలకు పునరావాసం కల్పించిందన్నారు. గతేడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముందుగానే అల్లూరి జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అల్లూరి జిల్లాకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైద్య, రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు.