
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : టిడిపి నేతల భూ కబ్జాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కనబడవా అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆయన విశాఖ పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యల్లో విషం, విద్వేషం తప్ప విషయం కనిపించడంలేదని అన్నారు. విశాఖ జిల్లా ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్‌నాథ్ మాట్లాడుతూ రుషికొండలోని ఎపిటిడిసి స్థలంలో ప్రభుత్వ నిర్మాణంపై ప్రశ్నించే పవన్‌కు ఎదురుగా గీతం యూనివర్సిటీలో చంద్రబాబు బందువు భరత్ చేసిన 43 ఎకరాల భూ కబ్జా కనిపించలేదా అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై కనీసం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. రుషికొండపై గతంలో ప్రభుత్వ రిసార్టులు ఉండేవని, అవి నేడు మరమ్మతుకు గురవడంతో అదే ప్రాంతంలో అధికారుల నిర్ణయంతో ప్రభుత్వం కొత్త భవన నిర్మాణం చేపడుతోందని అన్నారు. వీటి పక్కనే రామానాయుడు స్టూడియో, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఐటి హిల్స్, వెల్‌నెస్ సెంటర్లు ఉన్నప్పటికీ పవన్ నోరెత్తడం లేదన్నారు. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగితే పవన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. స్క్రిప్ట్ చదవడం, పక్క వాళ్లు చెప్పే మాటల ఆధారంగా ప్రసంగించడం పవన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించకుండా వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 2019 ఎన్నికల సమయంలో తాను గెలిచినా, ఓడినా గాజువాకలోనే ఉంటానని చెప్పిన పవన్ ఈ నాలుగేళ్లు ఎక్కడికి వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పాని డిమాండ్ చేశారు. విస్సన్నపేటలో తన పేరిట 600 ఎకరాల భూమి ఉన్నట్టు పవన్ నిరూపిస్తే ఈ ప్రెస్‌మీట్‌కు వచ్చిన ఒక్కో విలేకరికీ ఒక్కో ఎకరం ఇస్తానని, ఇంకా మిగిలితే ఆ భూమిని జనసేన పార్టీకి రాసిస్తానని అన్నారు.