గుడివాడ (కృష్ణా) : మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ... చిరంజీవి అభిమానులు కృష్ణా జిల్లా గుడివాడలో బుధవారం ఆందోళన చేపట్టారు. ర్యాలీ నిర్వహించారు. 'జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్' అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. అనంతరం పట్టణంలోని ఏజీకే స్కూల్ సెంటర్లో విజయవాడ మెయిన్‌రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించి నిరసన తెలిపారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానీకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.