Mar 07,2023 12:28

వాషింగ్టన్‌  :    ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ అయిన మెటా మరోసారి ఉద్యోగుల కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ వారంలో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వర్చువల్‌ రియాలిటీ వేదిక మెటావర్స్‌పై మెటా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. ఇటీవల వాణిజ్య ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గడంతో... ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టతరంగా మారిందని, దీంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతోందని పేర్కొన్నాయి. తొలగించనున్న ఉద్యోగుల జాబితాను తయారు చేయాల్సిందిగా డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్‌లను కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి.   కాలిఫోర్నియాకు చెందిన మెన్లోపార్క్‌లోని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపాయి.  గతేడాది నవంబర్‌లో 11,000 మంది (13 శాతం) ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. కంపెనీ వ్యయాలను తగ్గించుకునే క్రమంలో అవసరం లేని బృందాలన్నింటినీ తొలగించేందుకు యత్నిస్తోన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ గత ఫిబ్రవరిలో నివేదించింది.