May 01,2023 08:31

శ్రమను
చెమట చుక్క మింగేస్తుంది
రాలిన చుక్క గ్లోబల్‌ వార్మింగ్‌తో
కానరాట్లేదు
శ్రమను యంత్రం దోచేస్తుంది
యంత్రానికి సాంకేతికత తోడై
తోడేస్తుంది స్వేదాన్ని

శ్రమను
మెదడు కబళించేస్తుంది
శ్రమ
గంటల లెక్క మరిచింది
శ్రమ
ఆరంభం ముగింపులను బంధించింది

కానరాని
కానొచ్చే శ్రమలిప్పుడు
కాసులు లేవు
బెదిరింపులు అదిరింపుల లొల్లి
హక్కులే మరిచిన శ్రమ
నేలను గొడ్రాలిని చేసి
మనిషిని నిర్వీర్యుడిని చేసి
గాలిని అమ్మకంలో పెట్టిన పెట్టుబడి !
నీరునూ కొనే తంత్రంలోకి
పాచికలు వేసిన పెట్టుబడి
తనను తానే మింగుకునే తాచుపాము అవుతుంది
ఆలోచిస్తే మనిషి దాని గుట్టు తెలుస్తుంది

కానీ, మేడే అంటే
అదో సెలవుదినమనే తరం
కొన్నాళ్ళాగితే వెట్టిలో మగ్గే
మరుగుజ్జు తరం సాక్షాత్కారం !
 

- గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201