May 11,2023 08:40

వాషింగ్టన్‌ : వచ్చేవారం జపాన్‌లో జరగనున్న జి 7 దేశాల సదస్సుకు హాజరవాలనే భావిస్తున్నానని, ప్రభుత్వ రుణ పరిమితి ప్రతిష్టంభన అలాగే కొనసాగిన పక్షంలో తాను రాలేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. తమ ప్రభుత్వం ఎదుర్కొంటున్న రుణాల చెల్లింపు సమస్యను నివారించేందుకు కాంగ్రెస్‌తో జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించకపోతే ఆ పర్యటన రద్దయ్యే అవకాశాలు వున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుత ఎజెండాలో ఇదే అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో కాంగ్రెస్‌ నేతలు, స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్తీతో సమావేశానంతరం బైడెన్‌ విలేకర్లతో మాట్లాడారు. బైడెన్‌ రాకపోయే అవకాశాలు వున్నాయంటూ అమెరికా ప్రభుత్వం నుండి తమకు ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదంటూ జపాన్‌ ప్రభుత్వ ప్రతినిధి హిరొకజు మస్తునో బుధవారం తెలిపారు. రుణ పరిమితిని పెంచేందుకు కాంగ్రెస్‌ సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోకపోతే జూన్‌ 1నాటికల్లా ప్రభుత్వం వద్ద నగదు అయిపోతుందని, రుణాల చెల్లింపుల్లో సమస్యను ఎదుర్కొనవచ్చని గత వారమే అమెరికా ఆర్థిక మంత్రి హెచ్చరించారు.